హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేదనే ఆందోళనతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తలపట్టుకున్నారా? రాష్ట్రంలో 60శాతం గెలిచామనే ప్రకటనతో పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం దక్కాల్సిన సీట్లు రాలేదని ఆందోళనతో ఉన్నారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న 18చోట్ల బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని స్వయంగా ముఖ్యమంత్రే అంతర్గత సమావేశంలో అంగీకరించారా? పల్లె ఓట్లర్లను తమ వైపు తిప్పుకోవడంలో ఎందుకు వెనుకబడ్డామని, పంచాయతీ ఫలితాల దెబ్బకు ప్రాదేశిక ఎన్నికలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారా?
అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
పల్లె పోరులో ఊహించని పరాభవం ఎదురవడంతో ఫలితాలపై కాంగ్రెస్ పోస్ట్‌మార్టం చేస్తున్నది. శుక్ర, శనివారాల్లో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు వరుసగా విశ్లేషణలు చేశారు. నియోజకవర్గాలవారీగా ఆ పార్టీ గెలిచిన పంచాయతీల వివరాలను తెప్పించుకొని విశ్లేషించినట్టు తెలిసింది. ఫలితాల సమీక్ష తర్వాత ఇటీవల సీఎం ప్రెస్మీట్లో ప్రకటించిన వివరాలు శుద్ధ తప్పు అని తేలినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ 50శాతం పంచాయతీలను కూడా గెలుచుకోలేదని అంచనాకు వచ్చినట్టు తెలిసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో కూడా అనుకున్న స్థాయిలో గెలువలేకపోయామని, కొన్నిచోట్ల ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనూ ఓటమి పాలు కావడంపై సీఎం సీరియస్ అయినట్టు తెలిసింది. 22 నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాల వల్లే పార్టీకి నష్టం జరిగిందని తలంటినట్టు సమాచారం. మరో 15 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్థానికంగా లేకపోవడం వల్ల ఓడిపోయామని అంగీకరించినట్టు తెలిసింది. సొంత నియోజకవర్గాల్లో తిరగటానికి ఏం నొప్పి అంటూ ఎమ్మెల్యేలపై సీఎం ఫైర్ అయ్యారట. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, కార్యకర్తలను సమన్వయం చేయడంలో డీసీసీలు పూర్తి విఫలం అయ్యారని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం.
90శాతం ఫలితాలు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తాయని తాను అంచనా వేస్తే.. 50శాతం కూడా తీసుకురాలేకపోయారని సీరియస్ అయినట్టు తెలిసింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే 87చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం సాధించిందని సీఎం ప్రకటించటం ప్రజలను గందరగోళ పర్చేందుకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల అజాగ్రత్త వల్ల ప్రతిపక్షాలు లాభపడ్డాయని ఏఐసీసీ దూత మీనాక్షి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రెబల్స్‌తో సమన్వయలోపం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం వల్ల గెలిచే స్థానాల్లోనూ ఓడామని వరంగల్, నల్గొండ, పాలమూరు నేతలకు ఆమె క్లాస్ తీసుకున్నారని సమాచారం.
గ్రామీణ ప్రాంతాల్లో ఊహకు కూడా అందనంతగా పార్టీ నష్టపోయిందని, ఈ పరిస్థితుల్లో ప్రాదేశిక ఎన్నికలకు వెళ్తే మరింత వ్యతిరేక ఫలితాలు రావచ్చొని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలిసింది. మంత్రుల సొంత నియోజకవర్గాలు చెన్నూరు, మక్తల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఆధిపత్యం సాధించిన పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని, సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల ముహూర్తాలు పెట్టుకోవద్దని రేవంత్‌రెడ్డి సర్కారు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
రేవంత్ సూచనతో ఏఐసీసీ దూత మీనాక్షి నటరాజన్ కూడా ఏకీభవించినట్టు తెలిసింది. ఈలోగా తకువ పంచాయతీలను గెలుచుకున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేల వారి వివరాలు తెప్పించి, ఎందుకిలా జరిగిందో ఆరా తీయాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను ఆదేశించినట్టు తెలిసింది. పరిషత్ ఎన్నికల నాటికి గ్రూపుల సమస్య పరిషరించుకోవాలని, ఎకడా సమన్వయలోపం లేకుండా చూసుకోవాలని ఆయన్ను ఆదేశించినట్టు తెలిసింది.