హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెడును మైక్‌లో చెప్తూ.. మంచిని మాత్రం చెవిలో చెప్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది పార్టీకి, ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. ఆ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తొలిసారి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్ నేతల మీద బహిరంగంగా మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. ‘మంచిని మైకులో. చెడును చెవిలో చెప్పాలి. కానీ మనవాళ్లు చెడును మైకులో చెప్తున్నారు.. మంచిని చెవుల చెప్తున్నరు. ఇది పార్టీకి ఏమాత్రం లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒక్కటే. మంచి మైకులో చెప్పండి.. చెడును చెవిలో చెప్పండి. ఆ చెడును ఎట్లా సరిదిద్దుకోవాల్నో ఆలోచిద్దాం’ అని అన్నారు.
ఏపీలో రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ముందా?
సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కిషన్‌రెడ్డి అడ్డుపడటం వలనే తెలంగాణలో మెట్రోకు అనుమతి రాలేదని, మూసీ ప్రక్షాళన నిలిచిపోయిందని ఆరోపించారు. అభివృద్ధికి ఆయన సైంధవ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా..? అని ఈ సందర్భంగా సీఎం కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉపకులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నారని, ఏపీలో బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా? అని ప్రశ్నించారు. మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా తేవడం లేదని, ఒక ప్రాజెక్టు తీసుకురాలేదని ఆరోపించారు. కేంద్రానికి మనం రూపాయి చెల్లిస్తే.. మనకు కేంద్రం 42 పైసలు ఇస్తున్నదని పేర్కొన్నారు.