Runa Mafi | హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ‘రైతు రుణమాఫీ పథకంలో కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్‌కార్డే ప్రాతిపదిక’.. ఇది సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్న నిబంధన. ‘రేషన్‌కార్డు కాదు.. పాస్‌బుక్ ప్రాతిపదిక’… ఇదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం కలెక్టర్ల సదస్సులో చెప్పిన మాట. ఈ రెండింటిలో ఏది నిజమో తెలియక రైతులు, వ్యవసాయరంగ నిపుణులు తలలుపట్టుకుంటున్నారు. రుణమాఫీకి ప్రామాణికం రేషన్కార్డా? పట్టాదారు పాస్ పుస్తకమా? అనే ప్రశ్నలు తికమకపెడుతున్నాయి.
సాధారణంగా ఒకసారి మార్గదర్శకాలు విడుదలైన తర్వాత అందులో ఏదుంటే అదే ఫైనల్ అవుతుంది. మార్గదర్శకాల్లో రేషన్‌కార్డు అని పేర్కొని, ముఖ్యమంత్రి మాత్రం పాస్‌బుక్ అని చెప్పడంతో ఈ గందరగోళం ఏర్పడింది. ఒకవేళ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా రుణమాఫీకి పాస్‌బుక్ ప్రామాణికమైతే కుటుంబం, రేషన్‌కార్డు ప్రస్తావన ఎందుకు వస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సాధారణంగా రైతుకుండే భూమికి పాస్పుస్తకమే ప్రాతిపదిక. అలాంటప్పుడు భూమితో ఏ సంబంధమూ లేని రేషన్‌కార్డు ప్రస్తావన ఎందుకు వస్తున్నదో అర్థంకాని పరిస్థితి.
రుణమాఫీకి పట్టాదారు పాస్ పుస్తకమే ప్రాతిపదిక అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. దీని ప్రకారం పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. కానీ, ప్రభుత్వం అలా చేయడం లేదు. కుటుంబం పేరుతో రేషన్‌కార్డు నిబంధన పెట్టింది. తద్వారా అర్హుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నది. పట్టాదారు పాస్‌బుక్‌ను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉంటారు. రేషన్‌కార్డును లింకు చేసి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటే రైతుల సంఖ్య 60 లక్షలు మాత్రమే. అంటే 10 లక్షల మంది రైతులకు రుణమాఫీలో కోత పెట్టే అవకాశం ఉన్నది.
కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేస్తే ఆ కుటుంబంలోని రైతులకు నష్టం జరుగుతుంది. రైతులను వేర్వేరుగా పాస్‌బుక్ ద్వారా గుర్తించి రుణమాఫీ చేస్తే వారంతా రుణవిముక్తులవుతారు. రేషన్‌కార్డు నిబంధన ద్వారా కుటుంబం మొత్తానికి రూ.2 లక్షలు మాత్రమే రుణమాఫీ అయితే, పట్టాదారు పాస్‌బుక్ ద్వారా ఒక్కొక్కరికి రూ.2 లక్షల రుణమాఫీ అవుతుంది. ఈ నేపథ్యంలో పాస్‌బుక్ ప్రామాణికమైతే మళ్లీ రేషన్‌కార్డును లింకు చేసి కుటుంబం యూనిట్‌గా గుర్తించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నిబంధన అమలుతో అనేకమంది రైతులకు అనేక ఇబ్బందులు, నష్టాలు జరగనున్నాయి.
సాధారణంగా రైతులకు పంట రుణాలు ఇచ్చేప్పుడు బ్యాంకులు అన్నీ ఆలోచించి, అన్నీ పరిశీలించాకే రుణాలు ఇస్తాయి. ఇలా ఒకసారి రైతుకు బ్యాంకు రుణం ఇచ్చిందంటే ఆ రైతు రుణమాఫీకి పూర్తిస్థాయిలో అర్హుడవుతాడు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు పెట్టని కండీషన్లను రుణమాఫీ చేసేటప్పుడు అమలు చేస్తున్నది. తద్వారా అర్హత ఉన్నప్పటికీ కొంతమంది రైతులకు రుణమాఫీ కాకుండా ప్రయత్నిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. రేషన్‌కార్డు ద్వారా కుటుంబాన్ని గుర్తిస్తామని, కుటుంబానికి రూ.2 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామంటూ షరతులు పెడుతున్నది. అయితే రుణమాఫీ భారాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి షరతులు పెడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.