Revanth Reddy | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తన లక్కీ నంబర్ 9 అని పలుమార్లు వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అందుకు అనుగుణంగా సచివాలయంలో తన చాంబర్‌ను, తాను ఉపయోగించే వాహనాల నంబర్ ప్లేట్లను మారుస్తున్నట్టు తెలుస్తున్నది. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మాజీ సీఎం కేసీఆర్ చాంబర్ 6వ అంతస్థులో ఉండగా.. దానిని ఇప్పుడు 9వ అంతస్థుకు మారుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వారిని ఆదేశించినట్టు సమాచారం.
ఇటీవల సీఎం రేవంత్ 9వ అంతస్థును పరిశీలించి, చాంబర్ ఏర్పాటుకు ఉన్న సానుకూలతలను పరిశీలించారని అధికారులు తెలిపారు. ఇప్పటికే 9వ అంతస్థులోకి ఫర్నిచర్‌ను, దస్ర్తాలను తరలిస్తున్నట్టు చెప్తున్నారు. సీఎం లక్కీ నంబర్ ప్రకారమే ఈ మార్పు జరుగుతున్నదని అంటున్నారు. సీఎం కాన్వాయ్‌లోని వాహనాల నంబర్ ప్లేట్లు కూడా 9తో ఉండేట్టు మారుస్తున్నారని తెలిసింది. దివంగత మాజీ సీఎం ఎన్టీరామారావుకు కూడా లక్కీ నంబర్ 9 కావడం గమనార్హం.