హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ):‘టీచర్లు కష్టపడి పనిచేయాలి. మీరు బాగా పనిచేస్తే నేను రెండోసారి, మూడో సారి సీఎం అవ్వాలనుకుంటున్నాను’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తనకు స్వార్థం ఉన్నదంటూ మనసులోని మాటను బయటపెట్టుకున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించిన గురుపూజోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఢిల్లీలో కేజ్రీవాల్ సీఎం కావడానికి విద్యాభివృద్ధే కారణం. మీరు బాగా పనిచేస్తే.. నేను రెండోసారి, మూడో సారి సీఎం అవ్వాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిచోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనల గురించి తెలిసినప్పుడు తనకు బాధగా అనిపించిందని చెప్పారు. అందుకే టీచర్లు కూడా పిల్లలతోపాటే మధ్యాహ్న భోజనం తినాలని సూచించారు. అప్పుడే విద్యార్థులకు నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. అప్పుడప్పుడు తాను కూడా స్కూల్లో భోజనం చేస్తానని తెలిపారు. ‘రాష్ట్రంలో 27వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే విద్యార్థుల సంఖ్య 24 లక్షలు. ఇదే సమయంలో 11వేల ప్రైవేట్ స్కూళ్లుంటే విద్యార్థుల సంఖ్య 34లక్షలుగా ఉన్నది. దీనికి కారణం సీఎంగా నేనైనా అయి ఉండాలి. లేదా టీచైర్లెనా అయ్యిండాలి. లేదా పాఠశాలల్లో సరైన వసతులు, పిల్లలకు నమ్మకం విశ్వాసం కల్పించే పనిని ప్రభుత్వం చేయకపోయి అయినా ఉండాలి. ఇవన్నీ చేసినా వాటిని అమలుచేయడంలో టీచర్ల నిర్లిప్తత అయినా అయి ఉండాలి’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
రెండు గంటలు ఎదురుచూపులు
గురుపూజోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో టీచర్లు, విద్యార్థులకు ఎదురుచూపులు, నిరీక్షణ తప్పలేదు. పైగా ఎంపిక చేసిన 120 మందిలో దాదాపు పది మందికి మాత్రమే అవార్డులను అందజేశారు. మిగిలిన వారికి అధికారులే అవార్డులు అందజేయాల్సి వచ్చింది. ఇద్దరు అవార్డు గ్రహీతలు ఏకంగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్యక్రమానికి హాజరైన టీచర్ ఎమ్మెల్సీలు, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులకు గతంలో ప్రసంగించే అవకాశం ఇవ్వగా, ఈసారి మాత్రం వారికి నిరాశే ఎదురైంది. కార్యక్రమానికి కొందరు విద్యార్థినులను శాస్త్రీయ నృత్యం చేసేందుకు పిలిపించినా, వారికి అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తితో వెనుదిగారు. ఏ హోదాలో లేని ఓ ఉపాధ్యాయ సంఘం నేత వేదికపై కూర్చోవడం పట్ల కొందరు టీచర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, డాక్టర్ ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య, దయానంద్‌గుప్తా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, అధికారులు శ్రీదేవసేన, నవీన్ నికోలస్, కృష్ణ ఆదిత్య, హరిత తదతరులు పాల్గొన్నారు.
సీఎం నోట అబద్ధాలు
గురుపూజోత్సవం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు ఆడారు. ‘గతంలో గురుపూజోత్సవం జరిగిందా, సీఎంలు వచ్చారా?’ అని ప్రశ్నించారు. 2014లో రవీంద్రభారతిలో నిర్వహించిన గురుపూజోత్సవానికి సీఎం కేసీఆర్ స్వయంగా హాజరయ్యారు. నిరుడు రవీంద్రభారతిలో నిర్వహించిన గురుపూజోత్సవానికి సీఎం గా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులను ప్రారంభించామని సీఎం పేర్కొన్నారు. ఇప్పటివరకు వెయ్యి వరకు స్కూళ్లల్లో మాత్రమే ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ (ఈసీఈ)ను ప్రారంభించారు. వీటిలో పీపీ2 (ఒకటో తరగతి ప్రిపరేటరీ క్లాస్) మాత్రమే నిర్వహిస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను ప్రారంభిస్తున్నామని సీఎం చెప్పడంపై టీచర్ల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మూడు లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కారు బడుల్లో చేరారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంత మంది చేరి ఉండరని, అన్ని రకాల సర్కారు బడుల్లో ఈ ఏడాది విద్యార్థుల ఎన్రోల్మెంట్ 50వేల వరకు తగ్గినట్టు విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి.