హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలోని లోక్ సభ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలను కలిసి కేబినెట్, నామినేటెడ్ పోస్టులు, మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోవడంతో నామినేటెడ్ పోస్టుల (Nominated posts) భర్తీని పునస్సమీక్షించాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం. సీనియార్టీ ప్రాతిపదికన కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్టు తెలిసింది.
అలాగే తమతో చర్చించకుండానే నామినేటెడ్ పోస్టులు ప్రకటించారని మంత్రులు, ముఖ్యనేతలు, ఎమ్మె ల్యేలు కొందరు సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఆధారంగా వీటిలో మార్పుచేర్పులు ఉంటాయని అధిష్ఠానం అప్పుడు వారికి హామీ ఇచ్చింది. అలాగే మంత్రి పదవులను కూడా ఆశించే వారి సంఖ్య భారీగా ఉండటంతోఈ నేపథ్యంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.