శామీర్‌పేట, జూలై 15 : ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జీనోమ్ వ్యాలీలో మంగళవారం ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ నిర్మాణ పనులకు సంబంధించి మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే 33 శాతం వ్యాక్సిన్స్ , బల్క్ డ్రగ్స్‌లో 43 శాతం రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయని, కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలకు దక్కుతుందన్నారు.
ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే మా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని, మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది స్టేట్ మార్ లామీ మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ – ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు సహా ఇరుపక్షాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, వివిధ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై వారు చర్చించారు.