Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల్లోని ఉపకులాలన్నింటికీ సమానంగా రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు వారిని మూడు గ్రూపులుగా విభజించాలని ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీలలో మొత్తం 59 ఉప కులాలను గుర్తించిన కమిషన్ వాటిని గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని పేర్కొంది. ఏకసభ్య కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కోర్టు తీర్పు అమలులో భాగంగానే జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించామని తెలిపారు. ఈ కమిషన్ పలు జిల్లాల్లో పర్యటించి సమగ్ర నివేదికను రూపొందించిందని చెప్పారు.
ఎస్సీలకు రాజ్యాంగం ప్రకారం 15 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని, వాటిని 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ సిఫారసు చేసిందని తెలిపారు. ఎస్సీలలోని ఉపకులాల జనాభా ప్రాతిపతికను గ్రూపులను విభజించి, ఆయా గ్రూపుల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని సిఫారసు చేసిందని వెల్లడించారు. గ్రూప్-1లో 15 ఉపకులాలు (జనాభా 3.288శాతం) ఉండగా వారికి ఒక శాతం, గ్రూప్-2లోని 18 ఉపకులాలు (జనాభా 62.74శాతం) ఉండగా, వారికి 9 శాతం, గ్రూప్-3లో 26 ఉపకులాలు (జనాభా 33.96 శాతం) ఉండగా, వారికి 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సూచించింది. ఎస్సీ కులాలలోని గ్రూప్‌లకు రోస్టర్ పాయింట్లు, క్రిమీలేయర్ విధానాన్ని అమలు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. కాగా ప్రభుత్వం తిరస్కరించింది.
ఎస్సీల వర్గీకరణ, కులగణన నేపథ్యంలో ఇది తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన రోజు అని, ఇది ప్రత్యేకంగా గుర్తుండి పోతుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం తనకు వచ్చిందని అన్నారు. రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఓటు బ్యాంకుగా చూశాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయాయని అన్నారు. ఇప్పటికైనా వర్గీకరణ అమలుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. కమిషన్ సమర్పించిన 199 పేజీల నివేదికలో ఎస్సీల్లోని 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచిందని చెప్పారు. ఎస్సీలకు చెందిన 59 కులాలను మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు చేసిందని వెల్లడించారు.
గ్రూప్ పేరు : ప్రతిపాదిత రోస్టర్ పాయింట్లు
గ్రూప్- 1 : 7
గ్రూప్- 2: 2,16,27,47,52,66,72,87,97
గ్రూప్- 3: 22,41,62,77,91
జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేయాలని సిఫారసు చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతోపాటు గ్రూప్-1 సర్వీసుల్లో ఉన్న వారిని, ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని క్రిమీలేయర్గా పరిగణించాలని సూచించింది. ఈ వ్యక్తుల రెండో తరం వారు రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందకుండా మినహాయించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పేరొంది. కాగా ఈ సిఫారసులను ప్రభుత్వం తిరస్కరించిందని, మిగిలిన సిఫారసులను ఆమోదించింది అని సీఎం పేర్కొన్నారు.
దశాబ్దాల పోరాటానికి శాస్వత పరిష్కారం చూపినందుకుగాను ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా నిర్వహించుకోవాలని, అందులో అంతా పాల్గొనాలని సీఎం విజ్ఞప్తిచేశారు. ఎస్సీ వర్గీకరణతోపాటు కులగణనకు శాసనసభ ఆమోదం తెలిపిన రోజైన ఫిబ్రవరి 4ను ఇకనుంచి సోషల్ జస్టిస్ డేగా నిర్వహించాలని సీఎం బడుగు, బలహీన, దళిత, సామాజిక వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగాల భర్తీకి కమిషన్ ప్రిఫరెన్షియల్ మోడల్‌ను ప్రతిపాదించింది. గ్రూప్-1లో నోటిఫై చేయబడిన, భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్ అంటే గ్రూప్- 2 ద్వారా భర్తీ చేయాలి. గ్రూప్-2లో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్-3లోని వారి ద్వారా భర్తీ చేయాలి. అన్ని గ్రూపులలో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే భర్తీ చేయని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేయాలి.
బావూరి, బేడా (బుడ్గ) జంగం, చచాటి, డక్కల్- డొక్కల్వార్, జగ్గలి, కొలుపులవాండ్లు-పంబాడ-పంబండ-పంబాలా, మాంగ్, మాంగ్ గరోడి, మన్నే, ముష్తీ, మాతంగి, మెహతర్, ముండాల, సంబన్, సప్రు.
అరుంధతీయ, బండ్ల, చమర్- మోచి- ముచి- చమర్-రవిదాస్, చమర్-రోహిదాస్, చంబర్, చండాల, దండాసి, డోమ్- డోంబారా- పైడి- పానో, ఎల్లమ్మల్వార్- ఎల్లమ్మలవాండ్లు, గోడారి, జాంబువులు, మాదిగ, మాదిగదాసు- మష్తీన్, పామిడి, పంచమ- పరియ, సమగర, సిందోళ్లు (చిందోళ్లు), యాటల, వల్లువన్.
ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, ఆనాముక్, ఆరె మాల, ఆర్వ మాల, బారికి, బ్యాగరి, చలవాడి, డోర్, ఘాసి, హడ్డి, రెల్లి, దాచండి, గోసంగి, హోలేయా,హోలేయ దాసరి, మాదాసి కురువ, మాదరి కురువ, మహర్, మాల, మాల అయ్యవార్, మాల దాసరి, మాలదాసు, మాల హన్నయ్, మాలజంగం, మాల మస్తీ, మాలసాలె, నేతకాని, మాల సన్యాసి, మిత అయ్యల్వార్, పాకి, మోటీ, తోటి, రెల్లి.