హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ): భూసేకరణపైనే దృష్టి పెట్టాలని, అది పూర్తయిన ప్రాజెక్టులకే నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. జలసౌధలో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమై ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏడాదికి 5 లక్షల ఆయకట్టుకు నీరివ్వాలని, అలా పూర్తిచేయగలిగే ప్రాజెక్టుల వివరాలను సమర్పించాలని సూచించినట్టు తెలిసింది.
పనులు పూర్తిచేసి సాగునీరు ఇవ్వగలిగే ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే, ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణ అడ్డంకిగా మారిందని ఇంజినీర్లు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన రేవంత్రెడ్డి భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టుల పనుల పూర్తికే నిధులు మంజూరు చేస్తామని, కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టుకు అది వర్తింస్తుందని చెప్పినట్టు తెలిసింది. భూసేకరణ పూర్తికి ప్రాధాన్యమివ్వాలని, అవసరమైతే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఇంజినీర్లను ఆదేశించినట్టు సమాచారం.