హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 69వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన బుధవారం ఉదయం బయలుదేరుతారని సచివాలయ వర్గాలు తెలిపాయి. ఈసారి ఎవరూ పిలువకున్నా, ఎవరి అపాయింట్మెంట్ లేకున్నా ఢిల్లీ వెళ్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఎప్పటిమాదిరిగానే హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం కేంద్రమంత్రులను కలుస్తారని, అభివృద్ధి, సంక్షేమ పనుల కోసం విజ్ఞప్తులు చేస్తారని సీఎంవో నుంచి లీకులు వదులుతున్నారు. మరోవైపు సీఎంవో కార్యాలయం ఢిల్లీ అధిష్ఠానానికి మరోరకంగా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. సీబీఐ డైరెక్టర్‌ను కలిసేందుకు ఢిల్లీ వస్తున్నారని సమాచారం ఇచ్చారట.
కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్‌ట్యాపింగ్, విద్యుత్తు కొనుగోళ్ల మీద వేసిన విచారణ కమిటీలు ఇచ్చిన నివేదికలపై క్యాబినెట్లో చర్చ జరిగిందని, ఆయా కేసులకు సంబంధించిన నివేదికలను, ఫైళ్లను సీబీఐ డైరెక్టర్‌కు ఇచ్చేందుకు వస్తున్నారని ఏఐసీసీ నేతలకు సీఎంవో నుంచి సమాచారం అందినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ భవన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మంగళవారం రాత్రివరకు ఒక్కరి అపాయింట్మెంట్ కూడా దొరుకలేదని సమాచారం. మరోవైపు సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయం గతవారం అధికారికంగా లేఖ రాసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటివరకు సీబీఐ డైరెక్టర్ నుంచి ఎటువంటి స్పందన లభించలేదని చెప్తున్నారు. అయినా ఫైళ్లు పట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ ప్రయాణం కట్టినట్టు తెలుస్తున్నది.
బిల్డప్ ఇవ్వడానికేనా?
కేరళ విజయంలో తమదే కీలకపాత్ర అని సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితవర్గం తెగప్రచారం చేస్తున్నది. కేరళకు కాబోయే సీఎం ఎవరు? అనేదానిపై కాంగ్రెస్ పార్టీలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిక్కుముడిని విప్పడానికే కాంగ్రెస్ అధిష్ఠానం తనను పిలిపించిందని బిల్డప్ ఇవ్వడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారమైతుంది. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నప్పటికీ వారిని పక్కనబెట్టి సీఎం వెళ్తున్నట్టు తెలుస్తున్నది.