హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీమంత్రి హరీశ్‌రావు ఖండించారు. కరెంట్ కోతల విషయంలో సీఎం తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగుల మీద అభాండాలు వేయటాన్ని తీవ్రంగా ఎండగట్టారు. విద్యుత్తు రంగ వైఫల్యాలపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఆడరాక మద్దెల ఓడు అన్నట్టుగా ఉన్నదని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.
24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందని, రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే ఆ వ్యవస్థను కుప్పకూల్చిందని ధ్వజమెత్తారు. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయేలా విద్యుత్తు సరఫరా చేయటంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై రేవంత్ నిరాధార ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్తు ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి సీఎంకు లేకపోవటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విద్యుత్తు ఉద్యోగులను నిందించాలనే చిల్లర చేష్టలు మాని, కేసీఆర్ హయాంలో రెప్పపాటు కూడా పోనివిధంగా 24 గంటల విద్యుత్తుపై దృష్టిసారించాలని సీఎంకు సూచించారు. తనలాగే అందరూ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతారని సీఎం భ్రమల్లో ఉండకుండా పాలనపై దృష్టిసారించాలని హితవు పలికారు.