మెట్పల్ల్లి, డిసెంబర్ 3: ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ నిర్మిస్తామంటూ నిధులు విడుదల చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. ప్రభుత్వ దవాఖానలను నిర్లక్ష్యం చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. ఓవైపు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ముందుకుసాగక ప్రజలు కష్టాలు పడుతుంటే.. ప్రభు త్వం మాత్రం ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ నిర్మిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నదని మండిపడ్డారు. ముందుగా నిధులు లేక నిలిచిపోయిన పనులు పూర్తి చేసి ఆ తర్వాత సిటీలు కట్టుకోండని హితవుపలికారు.
బుధవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిధులలేమితో రెండేండ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ దవాఖాన నూతన భవ నం, వెల్లుల్ల రోడ్డులోని సమీకృత మార్కెట్ నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో రూ.7 కోట్లతో భవన నిర్మాణ పనులను 90 శాతం పూర్తి చేశామని, రూ.6 కోట్లతో సమీకృత మార్కె ట్ నిర్మాణం పనులు చేపట్టామని తెలిపా రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోవడంతో రెం డేండ్లుగా పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వ దవాఖాన భవనం శిథిలావస్థలో ఉందని, వసతులు లేకపోవడంవల్ల రోగులు, వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తున్నదని ఆవేదనవ్యక్తంచేశారు.