హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి సోమవారం స్విట్జర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు అక్కడి దావోస్లో జరిగే సదస్సులకు సీఎం హాజరుకానున్నట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. రాష్ర్టానికి పెట్టుబడులు రాబట్టడంలో భాగంగానే సీఎం స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్తున్నారని పేర్కొన్నది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దావోస్ వెళ్లడం ఇది మూడోసారి. దావోస్ నుంచి ఆయన నేరుగా అమెరికాకు వెళ్తారని తెలుస్తున్నది. దీనిపై సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కానీ, స్విట్జర్లాండ్ నుంచి ఈనెల 23న అమెరికా వెళ్తారని, అక్కడ ఓ యూనివర్సిటీలో జరిగే నాయకత్వ శిక్షణ కార్యక్రమానికి హాజరై ఫిబ్రవరి 3న తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారని సమాచారం.
పర్యటనలకే ప్రాధాన్యం
రేవంత్రెడ్డి సీఎం అయ్యాక 3సార్లు స్విట్జర్లాండ్ వెళ్లినట్టవుతుంది. తొలి ఏడాది దావోస్ వెళ్లిన సందర్భంగా స్విట్జర్లాండ్ కాదు.. ఇంగ్లాండ్, దుబాయ్ చుట్టేసివచ్చారు. 2024లో ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. 2025 జనవరి 20 నుంచి 5రోజులు దావోస్ పేరుతో మరో యాత్రకు, 2025 ఏప్రిల్ 16 నుంచి మూడురోజులు జపాన్ పర్యటనకు వెళ్లొచ్చారు. సీఎం అయిన 25 నెలల్లో ఏడు దేశాలను చుట్టొచ్చారు. సీఎం రేవంత్రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ కోర్సు చేయనున్నారు. ‘లీడర్షిప్ 21 సెంచరీ’ అనే కోర్సుకు హాజరుకాబోతున్నారు. 25 నెలల పాలనలో రేవంత్రెడ్డి రెండోసారి అమెరికాకు వెళ్లొచ్చిన రికార్డు నెలకొల్పుతారు. 25 నెలల్లో 62 సార్లు ఢిల్లీకి, 7 దేశాల పర్యటనలు చేశారు.