Harish Rao | ఎక్కడ నిరసన చెలరేగినా, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్ర అని ప్రచారం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి రివాజుగా మారిందని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై హైదరాబాద్ తెలంగాణ భవన్లో ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్ఎస్ ఛార్జిషీట్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. వరద బాధితుల నుంచి హైడ్రా బాధితుల దాకా.. లగచర్ల నుంచి దిలావర్ పూర్ దాకా.. నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా.. ఎవరు రోడ్డెక్కినా వారి వెనుక ప్రతిపక్షమే ఉందంటున్నారని విమర్శించారు. చివరకు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే కూడా ప్రతిపక్షాల కుట్ర అంటున్నారని మండిపడ్డారు. ప్రజలు చేసిన పోరాటాలను జీర్ణించుకోలేక సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయని నిందలు వేస్తున్నాడని హరీశ్‌రావు అన్నారు. వీళ్ల అసమర్థ నిర్వహణ వల్ల కరెంట్ పోతే, అది కూడా హరీశ్ రావే చేయించాడని అవాకులు చెవాకులు పేలడం రేవంత్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు.
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకమార్లు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నాడని హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి పదవినే రేవంత్ రెడ్డి నవ్వులపాలు చేస్తున్నాడని విమర్శించారు. హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలున్నాయట. అందుకే నేవీ రాడార్ కేంద్రం దామగుండంలో పెడుతున్నారని అన్నాడని గుర్తుచేశారు. రాష్ట్రం చుట్టూ మూడు సముద్రాలు లేవు గానీ, ముఖ్యమంత్రి గారికి మాత్రం సముద్రమంత అజ్ఞానం ఉందని జనం నవ్వుకుంటున్నరని విమర్శించారు. తెలంగాణలో భాక్రానంగల్ ప్రాజెక్టు ఉందని ముఖ్యమంత్రి నొక్కి వక్కాణించారని తెలిపారు. భాక్రా – నంగల్ అనేవి రెండు ప్రాజెక్టులు, అవి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయి, అవి ఉన్న ప్రదేశాలను బట్టే వాటికి ఆ పేరు వచ్చిందని వివరించారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలమ్ముతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. అబద్ధమాడినా అతికినట్టుండాలని మండిపడ్డారు. జీతం పద్దులు చూస్తే లక్షా 60వేల ఉద్యోగాలు ఇచ్చారని ఎవరికైనా అర్థమవుతుందని తెలిపారు. మల్లన్న సాగర్‌లో 50 వేల ఎకరాలు మునిగాయని, నిర్వాసితులకు ఒక్క ఇల్లు కట్టలేదని నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పిండని ఆగ్రహం వ్యక్తం చేశారు.14వేల ఎకరాలకు మించి మునగలేదని, మూడు వేలకు పైగా ఇల్లు కట్టారని రికార్డులు చూసినా, అక్కడికి వెళ్లినా తెలుస్తుందని చెప్పారు. దావోస్‌కు పోయిన ముఖ్యమంత్రి విదేశాల్లో కూడా తన అజ్ఞానాన్ని దాచుకోలేదని ఎద్దేవా చేశారు. ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘‘ IT and Pharma is a Nuclear Chain reaction ’’ అన్నాడని తెలిపారు. దాని అర్థమేంటో ఆ భగవంతుడే తెలియాలని అన్నారు. ఆ చైన్ రియాక్షన్ ఏమిటో రాహుల్ గాంధే వివరించాలన్నారు.
మన ముఖ్యమంత్రికి దుర్భాషా దురంధరుడు అనే బిరుదు ఇవ్వచ్చని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పండబెట్టి తొక్కుతా.. చీరుతా.. చింపుతా.. సంపుతా.. గుడ్లు పీకి గోటీలాడుతా.. యాప శెట్టుకు కట్టేసి లాగుల తొండలిడుస్తా.. అని శాడిస్టు భాషలో హరీశ్‌రావు చెలరేగిపోతాడని విమర్శించారు. బుల్డోజర్ తో తొక్కిస్తం.. మానవ బాంబులై చంపేస్తం.. అని టెర్రరిస్టులా రెచ్చిపోతాడని అన్నారు. నా కొడకల్లారా.. ఒక్కొక్కన్ని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతా అని ఉన్మాదిలా వాగుతాడని అన్నారు. బాడీ షేమింగుకు బ్రాండ్ అంబాసిడర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. పసిపిల్లలను సైతం బాడీ షేమింగ్ చేసిన రేవంత్ రెడ్డి, నాలాంటి వాళ్లను చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదని అన్నారు. ఎప్పుడో ఒకసారి మాట తూలడం ఎవరి విషయంలోనైనా జరగొచ్చు. కానీ, ఎప్పుడూ బూతులే మాట్లాడటం సీఎం రేవంత్ కు అలవాటుగా మారిందని అన్నారు. రాజకీయ పరిభాషను దిగజార్చడంలో రేవంత్ రెడ్డిది మేజర్ కంట్రిబ్యూషన్ అని అన్నారు.