Errabelli Dayakar Rao | సీఎం రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో దొడ్డు వడ్లు కొనాలన్న రేవంత్రెడ్డి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత దొడ్డు వడ్లు కాకుండా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చేతులు ఎత్తేస్తున్నారని విమర్శించారు. సీఎం బోగస్ మాటలు ప్రజలు ఎవరు నమ్మరాదని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్ని అమలు చేయకుండా మళ్లీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ముందు మరో మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేంద్రం దొడ్డు వడ్లు కొనకపోయినా అప్పటి సీఎం కేసీఆర్ రైతుల వద్ద నుంచి ప్రతి గింజనూ(తడిసిన ధాన్యం) కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అయిపోవడంతో ఇచ్చిన హామీలను మరిచి దాటవేస్తున్నారని విమర్శించారు.
కేవలం 20 శాతం మేరకు సాగు అయ్యే సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చి దొడ్డు వడ్లకు ఇవ్వమని అనడం అంటే తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినట్లేనని ఎర్రబెల్లి ఆరోపించారు. రెండు నెలల నుంచి కళ్లాలలో ధాన్యం ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అబద్ధపు, మోస పూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఓడ మల్లన్న… ఎన్నికలు అయినంక బోడ మల్లన్న అన్నట్టుగా సీఎం రేవంత్రెడ్డి వ్యవహారం ఉందని ఎర్రబెల్లి ఎద్దేవాచేశారు. వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చీటర్ మల్లన్నను చిత్తుగా ఓడించాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.