Banakacherla | హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై15 (నమస్తే తెలంగాణ) : బనకచర్ల అంశంపై కూర్చొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ ఖరారు చేయించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సమక్షంలో జరిగే భేటీకి తెలంగాణ సీఎం ఒప్పుకున్నారు. బుధవారం సమావేశం అయ్యేందుకు రెండు రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇద్దరు సీఎంలకు సమాచారమిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో సమావేశం ఎందుకు జరుగుతున్నదని చిన్న పిల్లగాడిని అడిగినా ఠక్కున బనకచర్ల మీదనే అని బదులిస్తాడు. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి మాత్రం మంగళవారం ఉదయం ‘బాబు కోసం.. కొత్త మోసం’ బయటపడటంతో హఠాత్తుగా జ్ఞానోదయం అయ్యింది. నేను ఢిల్లీకి వెళ్లి కృష్ణాజలాల హక్కు కోసం పోరాడాలనుకుంటే కేంద్రం బనకచర్ల మీద చర్చించాలని అనడం ఏమిటి? అని అనుమానం వచ్చింది.
ఇలా అయితే నేను చర్చలకే రానంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో హడావిడిగా లేఖ రాయించారు. ఆ లేఖకు కేంద్రం నుంచి స్పందనే లేదు. అయినా సీఎం రేవంత్ తన పర్యటన ఆపలేదు. మంగళవారం సాయం త్రం హస్తిన బాట పట్టారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగే సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొననున్నారు. ఇది అధికారిక భేటీ కావచ్చే తప్ప అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదని అందరికీ తెలుసు. బనకచర్లపై గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్లో తేల్చుకుందామంటూ హడావుడి చేసిన రేవంత్ రెడ్డి బుధవారం నాటి భేటీకి హాజరు కావడం వెనక ఆంతర్యమేమిటి? బనకచర్ల సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ సీఎం హాజరవుతున్న సమావేశానికి అధికారిక ప్రామాణికత ఎంత? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా ప్రాజెక్టుపైన నిర్మించిన తెలంగాణ ప్రాజెక్టులకు నీటి వాటా కోసం భేటీకి వెళ్తున్నట్టు తెలంగాణ సీఎంవో చెప్పుకొచ్చినా, చంద్రబాబు మాత్రం తమది బనకచర్ల మాత్రమే ఏకైక ఎజెండా అని కేంద జలశక్తి శాఖ మంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీని ఖరారు చేశారు. ముఖ్యమంత్రులు తమ బృందాలతో రావాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు రాష్ట్రం నుంచి సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ఆయా శాఖల అధికారులు, ఏపీ నుంచి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు పాల్గొననున్నారు. ఎజెండా పంపాలని ఇరు రాష్ర్టాలను కేంద్ర జలశక్తి శాఖ కోరగా.. కృష్ణాపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఎజెండాగా పంపించింది. ఏపీ మాత్రం తమది బనకచర్లపై చర్చించాలనే సింగిల్ పాయింట్ ఎజెండా మాత్రమేనని, అంతకు మించి కృష్ణా జలాలపై తాము ఏమీ మాట్లాడబోమని స్పష్టం చేసినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. వ్యాపోస్తో ఏపీ ప్రభుత్వం సర్వే చేయించి, ఆ నివేదికలతో ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. బనకచర్ల ద్వారా కేవలం మిగు లు జలాలు, సముద్రంలోకి వెళ్లే వృథా నీటినే 200 టీఎంసీలు వాడుకుంటామనే ప్రతిపాదనలను కేంద్రం ముందు పెట్టి, తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చేలా లాబీయింగ్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి పూటకో మాటలా వ్యవహరిస్తున్నారు. గోదావరి బోర్డులోనే తేల్చుకుంటానంటూ ఇటీవల ప్రకటించినా, ఇప్పటివరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు తెలంగాణ కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. అందుకే కొన్నిరోజుల కిందట కేంద్ర జల్‌శక్తి శాఖ ‘ఏమైనా అంశాలున్నాయా?’ అని జీఆర్ఎంబీని అడిగినపుడు ‘ఏమీ లేవు’ అని సమాధానం ఇచ్చింది. బనకచర్ల వివాదంపై గోదావరి నదీ యాజమాన్య బోర్డులో చర్చించాలి. తేలకుంటే కేంద్ర జల్‌శక్తి శాఖ అపెక్స్ కౌన్సిల్ భేటీని ఖరారు చేస్తుంది. ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం హక్కుగా కల్పించిన ఇలాంటి అధికారిక భేటీలను కాదని, ఈ సమావేశానికి సీఎం రేవంత్ ఒప్పుకోవడం ఏమిటనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే ఇద్దరు సీఎంలు చేసే ప్రతిపాదనలు, అభ్యంతరాలు అధికారికంగా నమోదవుతాయి. వాటికి చట్టబద్దత ఉంటుంది. తద్వారా ఏ రాష్ట్రమైనా తమకు ప్రతికూల నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంటే వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఉంటుంది. కానీ బుధవారం కేంద్ర మంత్రి సమక్షంలో జరిగే సీఎంల సమావేశానికి ప్రామాణికత ఎంత అనేది అనుమానమేనని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. సమావేశంలో తన వంతు వచ్చినప్పుడు చంద్రబాబు కచ్చితంగా బనకచర్ల అంశాన్ని ప్రస్తావిస్తారు. రేవంత్‌రెడ్డి అవునన్నా, కాదన్నా, అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేంద్ర జలశక్తి వాటిని నమోదు చేసుకుంటుంది. తద్వారా బనకచర్లపై జరిగిన చర్చల్లో సీఎం పాల్గొన్నారనేది అధికారికంగా నమోదవుతుంది. అలాంటప్పుడు బనకచర్లపై తాము చర్చించబోమంటూ తెలంగాణ సీఎస్ కేంద్రానికి రాసిన లేఖకు సార్థకత ఏముంటుంది? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చల ద్వారా తెలంగాణ అభిప్రాయాలను, అభ్యంతరాలను కేం ద్రం ముందుంచినట్లవుతుందే తప్ప ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం చట్టబద్దత ఉండదని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు ఈ మర్మాన్ని గుర్తించే అపెక్స్ కౌన్సిల్ భేటీ అనకుండా కేంద్ర మంత్రి సమక్షంలో ఇద్దరు సీఎంల సమావేశంగా ఖరారు చేశారని చెప్పుకుంటున్నారు.
చంద్రబాబు లాబీయింగ్, బనకచర్ల సింగిల్ పాయింట్ ఎజెండా మీద అభ్యంతరం తెలుపుతూ రేవంత్‌రెడ్డి ఈ భేటీని బహిష్కరిస్తారని అంతా భావించారు. బనకచర్ల నిర్మాణం మీద అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ తరఫున బలమైన నిరసన వ్యక్తంచేస్తారని అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజల అంచనాకు భిన్నంగా రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రిత్వ శాఖ మధ్యవర్తిత్వ భేటీకి సిద్ధమయ్యారు. కృష్ణాజలాల్లో తెలంగాణ ప్రా జెక్టులకు హక్కుల సాధనకే సీఎం ఢిల్లీకి వెళ్తున్నారని సీఎంవో ప్రకటన ఇచ్చింది. కానీ సాంకేతికంగా ఇదంతా కప్పిపుచ్చుకునే యత్నమని అర్థమవుతుంది. కృష్ణా జలాల కేటాయింపులపై బిజేష్కుమార్ ట్రిబ్యునల్ నడుస్తుండగా ప్రత్యేక భేటీలు ఎందుకు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ తన వాటా హక్కులపై ఎన్ని ప్రతిపాదనలు పెట్టినా ‘ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్నది కదా?’ అని కేంద్రం నుంచి సమాధానం వస్తుందని అంచ నా వేస్తున్నారు. ఒకవేళ కృష్ణా ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశాన్ని ప్రస్తావిస్తే, ‘సాంకేతికంగా నికరజలాల కేటాయింపులుంటే తప్ప కేంద్ర జల సం ఘం జాతీయహోదాకు సిఫార్సు చే యదు’ అని పేర్కొంటున్నారు. కాబట్టి ఈ భేటీలో కృష్ణాజలాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం అనుమానమేనని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు కేవలం బనకచర్ల చర్చకు వేదికను ఏర్పాటుచేస్తే తెలంగాణ సీఎం కృష్ణాజలాల హక్కులు, ప్రాజెక్టులపై ఎలా మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు. బనకచర్లను అధికారికంగా చంద్రబాబుకు అప్పగించడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఇలా దొడ్డిదారి మార్గాన్ని ఎంచుకున్నారని విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.