హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తాము చేపట్టిన కుల గణన సర్వే నివేదికను ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ఆయన కుల గణన నివేదికను ప్రవేశపెట్టి ప్రసంగించారు. రాష్ట్రంలో 46.25 శాతం బీసీలు ఉన్నారని, మైనార్టీల్లోని 10.08 శాతం మంది బీసీలను కూడా కలుపుకొని మొత్తం 56.33 శాతం మందికి సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పారు. గత 75 ఏండ్లుగా బీసీల వివరాలు, లెక్కలులేవని, ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సామాజిక కుల సర్వేను నిర్వహించామని సీఎం వెల్లడించారు. ఇతర రాష్ర్టాల్లో న్యాయస్థానాల ముందు ఈ ప్రక్రియ నిలవకపోవడంతో అలాంటి తప్పిదం జరగొద్దని, సర్వేను పకడ్బందీగా నిర్వహించామని తెలిపారు.
తమ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2024 ఫిబ్రవరి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సామాజిక సర్వే నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఏడాది తర్వాత మళ్లీ ఫిబ్రవరి 4న సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టామని అన్నారు. సర్వే పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశామని, కర్ణాటక, బీహార్‌లో జరిగిన సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని చెప్పారు. సర్వే నిర్వహణ కోసం 1.03 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమించామని తెలిపారు.
నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు సర్వేను నిర్వహించామని, గ్రామీణ ప్రాంతాల్లో 66.99 లక్షలు, నగరాల్లో 45.15 లక్షల చొప్పున మొత్తం 1.12 కోట్ల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయని తెలిపారు. మొత్తం 1.15కోట్ల కుటుంబాలకు గాను 1.12కోట్ల కుటుంబాలను సర్వేచేశామని, సర్వే కవరేజీశాతం 96.9 శాతంగా నమోదయ్యిందని చెప్పారు. వివిధ కారణాలతో 3,56,323 కుటుంబాలను సర్వేచేయలేదని, ఆ కుటుంబాలు జీహెచ్ఎంసీలోనే అధికంగా ఉన్నాయ ని అన్నారు. మొత్తంగా 3,54,77,554 మందిని సర్వేచేశామని చెప్పారు.
కులగణన సర్వేలో పాల్గొననివారికి శాసనసభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వవద్దని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పులతడకగా ఉన్నదని మాజీ మంత్రి కేటీఆర్ గణాంకాలతో సహా వివరించడం, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం సర్వే నివేదికను తప్పుబట్టడంతో సీఎం అసహనానికి గురయ్యారు. కేటీఆర్‌ను అడ్డుకునేందుకు కొత్తరాగం ఎత్తుకున్నారు. సర్వేలో పాల్గొననివారిని శిక్షించాలని స్పీకర్‌ను కోరారు. ‘
సర్వేలో పాల్గొన్నవారికి మాత్రమే మైక్ ఇవ్వండి. సర్వేలో పాల్గొననివారికి మాట్లాడే అర్హత లేదు, వారికి మైక్ ఇవ్వకండి’ అని సభ్యులందరి తరఫున కోరుతున్నట్టు చెప్పారు. సీఎం వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదని, మరి వాళ్లందరినీ శిక్షిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. సర్వేలో పాల్గొనడం, వివరాలు ఇవ్వడం అంతా స్వచ్ఛందమని గతంలో ప్రభుత్వం, మంత్రులు ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దీంతో ఇష్టం ఉన్నవారు స్వచ్ఛందంగా వివరాలు ఇచ్చారని, ఇష్టం లేనివారు వివరాలు ఇవ్వలేదని అంటున్నారు. వివరాలు ఇవ్వకపోతే శిక్షిస్తామని ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు.