TDP | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేసి ఉంటే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని సీఎం రేవంత్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ కనీసం 10 శాతం ఓట్లు దక్కించుకొనేదని చెప్పారు. అప్పుడు కచ్చితంగా తమ పార్టీ గెలుపోటములు ప్రభావితమై ఉండేవని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో గురువారం సీఎం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఏపీలో చంద్రబాబునాయుడు 23 సీట్లు వచ్చినా కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడార ని, అందుకే మళ్లీ గెలవగలిగారని అన్నా రు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి అలా లే దని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లు వారి ఓట్లు వారే వేసుకొని ఉంటే కాంగ్రెస్ 12 సీట్లు గెలిచేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడిని కించపరిచేలా మాట్లాడనని, ఆయనని అనాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే.. ఒక్కపనీ పూర్తిచేయలేనని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘అన్నీ స్తంభించిపోతాయి, ఆయా శాఖలలో ఎంతమందినని తొలగిస్తాం. నేను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రైవేటు ఇ న్ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు కూడా ఉంటాయి. అందులో కేవలం ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్ ఒక్కడే ఉండరు. ఒకసారి కేసు నమోదైతే బ్యాంకులు రూపా యి రుణం ఇవ్వవు ఓడీలను వెనక్కు తీసుకుంటాయి. అప్పులు తీర్చమని ఒత్తిడి తెస్తాయి. దాంతో రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి పెట్టడానికి ఎవ్వరూ ముందుకురారు’ అని చెప్పారు. హైదరాబాద్‌లో వైఎస్ జగన్ ఇంటిముందు కూల్చివేతల గురించి తనకు ఎవరూ చెప్పలేదని అన్నా రు. బయట మాత్రం చంద్రబాబు చెప్తేనే చేయించినట్టు ప్రచారం చేశారని అన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి రాహుల్‌గాంధీ తీసుకోవాలని సీడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి తానే చొరవ తీసుకున్నానని రేవంత్‌రెడ్డి చెప్పారు. రా హుల్ గాంధీకి అద్భుతమైన జ్ఞానం ఉం దని ప్రశంసించారు. ప్రధాని మోదీ రాజకీయ ప్రభ సృష్టించుకున్నారే తప్ప లోతైన జ్ఞానం లేదని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌కు ఏపీ రాజధాని అమరావతి పోటీ కాదని రేవంత్ పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల లక్షల ఎకరాల భూములున్నాయని, నగరంలో ఒకవైపు ఉన్నవారు మరోవైపు వెళ్లడానికి ఇష్టపడటం లేదని చెప్పారు.
హైదరాబాద్ పాత బస్తీలో 40 శాతం విద్యుత్తు బిల్లులు వసూలు కావడం లేదని సీఎం రేవంత్ చెప్పారు. దీన్ని సరిదిద్దడానికి ఆదానీ వాళ్లను పిలిచామని తెలిపారు.