నాగర్‌కర్నూల్, జూన్ 5 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన మొక్కుబడిగా సా గిందని జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలన కార్యక్రమం.. ‘వచ్చిండు.. చూసిం డు… పోయిండు..’ అన్న రీతిలో సాగిందని చర్చించుకుంటున్నారు. సీఎం రెండ్రోజుల పర్యటనలో ప్రాజెక్టు సందర్శన అనంతం జిల్లాలో ఎక్కడా మాట్లాడలేదు. రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతో కలిసి ఇప్పటివరకు జరిగిన పనులను పరిశీలిస్తూ పర్యటించారు. జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనలో భా గంగా శుక్రవారం మొదటగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ వద్ద ప్యాకేజీ-2, ప్యాకేజీ-3 కాల్వల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పనుల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, పాలమూరు ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం తెలిపారు. అనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టమ్‌ను మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, చీఫ్ ఇంజినీర్ విజయభాస్కర్‌తో కలిసి పరిశీలించారు.
అనంతరం నార్లాపూర్ ప్యాకేజీ-1లోని పంప్‌హౌస్‌ను పరిశీలించారు. ప్యాకేజీ 2,3లోని హెడ్‌రెగ్యులేటరీ వద్ద ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ప్రాజెక్టులో భాగమైన డెలివరీ సిస్టమ్‌ను పరిశీలించారు. ఇక్కడ 6.4 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉండగా మొత్తం 8 పం పుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు రూపొందించినట్టు అధికారులు వివరించారు. పథకం కింద మొత్తం 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం కాగా, శ్రీశైలం బ్యాక్‌వాటర్ ద్వారా నీటిని ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్‌కు, డెలివరీ సిస్టమ్ ద్వారా నీరు చేరుకున్న అనంతరం అక్కడినుంచి ఇదే ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 4, 5కు పంపించనున్నట్టు అధికారులు తెలిపారు. డెలివరీ సిస్టమ్‌లో 4 పంపులు సిద్ధంగా ఉం డగా, మరో 4 పంపులు కూడా నీటి ఎత్తిపోతకు సి ద్ధంగా ఉన్నాయని తెలిపారు. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ప్యాకేజీ 2, 3, 4 ద్వారా ఏదుల పంప్‌హౌస్‌కు సాగునీటిని అందించడంలోని ఇబ్బందు లు, ప్రస్తుత పరిస్థితులను సీఎం పరిశీలించారు. ఎంజీకేఎల్ఐ పంప్‌హౌస్‌ను కూడా పరిశీలించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం వద్ద ఉన్న వట్టెం పంప్‌హౌస్ (లిఫ్ట్-3)ను సీఎం సందర్శించా రు. అక్కడ జరిగిన పనులను పరిశీలించారు. టన్నెల్లో ప్రయాణించి.. పంప్‌హౌస్‌లను పరిశీలించి అక్కడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 2020-23 సంవత్సరం నాటికి రూ.3,300 కోట్లు ఖర్చు చేయగా, 2023 నుంచి ఇప్పటివరకు రూ.800 కోట్లు ఖర్చుచేసినట్టు అధికారులు రేవంత్‌కు వివరించారు. మిగతా సివిల్ పనులను రూ.90 కోట్లతో వచ్చే 3నెలల్లో పూర్తి చేయనున్నట్టు తెలిపారు. పనులు త్వరగా చేపట్టాల ని సీఎం ఆదేశించారు. ఉదయం 10:50 గంటలకు నార్లాపూర్ వద్ద ప్రారంభమైన సీఎం ప్రాజెక్టు పరిశీలన మధ్యాహ్నం 12:50వరకు కొనసాగింది. అనంతరం వట్టెం రిజర్వాయర్‌ను గంటపాటు పరిశీలించి ఉద్దండాపూర్ బహిరంగ సభకు తరలివెళ్లారు.
మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల టౌన్, జూన్ 5: సీఎం రేవంత్ఉమ్మడి పాలమూరులో చేపట్టిన ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమానికి ప్రకృతి సహకరించలేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ ఇంజినీరింగ్ అద్భుతాన్ని చూడలేక కుళ్లుకుంటున్న కాంగ్రెస్ నేతలపై ప్రకృ తి కూడా కన్నెర్ర చేసిందని జనం గుసగుసలాడుకున్నారు. గాలివాన ధాటికి ఉద్దండాపూర్ రిజర్వాయర్ సమీపంలో టెంట్లు కుప్పకూలాయి. కుర్చీలు ఎగిరిపోయాయి. జడ్చర్ల బహిరంగ సభలో కూడా వేసిన కుర్చీలన్నీ చిందరవందరయ్యాయి. భారీ ఫ్లెక్సీలన్నీ నేలకూలాయి. కేవలం అరగంటలోనే సీఎం పర్యటించే ప్రాంతాలు అతలాకుతలం అయిపోయాయి.