నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ అదే బుద్ధి చాటుకున్నారు. ఆ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొంతకాలంగా నోరు అదుపులో పెట్టుకున్నట్టుగా కనిపించిన సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ నోరుపారేసుకున్నారు. శవాలు… చావు లు… బొందలంటూ తన స్థాయిని మరిచి అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో ‘ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల’ పేరుతో నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పటిలాగే చావులు కోరుతూ శవాల గురించి మాట్లాడారు. 2005లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఎస్ఎల్బీసీని ప్రారంభించి 30 కిలోమీటర్లు పూర్తి చేసిందని, గత పదేండ్లల్లో ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదని, తమ ప్రభుత్వం వచ్చాకనే తిరిగి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు అందులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పేతే… హమ్మయ్య ఎస్ఎల్బీసీ ఆగిపోయిందని పైశాచిక ఆనందంతో డ్యాన్సులు చేస్తున్నారంటూ అనుచిత వ్యాఖ్య లు చేశారు.
అక్కడున్న కార్మికులే కాదు… మీరందరూ పోయి నాగార్జునసాగర్లోనో, శ్రీశైలంలోనో, బండరాళ్లు కట్టుకుని దుం కినా.. ఈ శవాలనైనా వెతికిస్తా.. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం’ అంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. దీంతో మీడియా ప్రతినిధులతోపాటు పక్కనే ఉన్న వీఐపీ సీట్లల్లో ఆసీనులైన వారు సైతం ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ సర్కార్ ముందస్తు చర్య లు చేపట్టకుండానే ఎస్ఎల్బీసీ టన్నెల్ పను లు ప్రారంభించిన నేపథ్యంలో కార్మికుల ప్రా ణాలను బలిగొన్న విషయం తెలిసిందే. నేటికీ వారి శవాలను వెలికితీయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నది. వాస్తవంగా కష్టసాధ్యమైన టెక్నాలజీతో ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా క్లిష్టమైన డిజైన్‌తో 2005లో అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం మెబిలైజేషన్ అడ్వాన్స్‌ల కోసం ఎస్ఎల్బీసీ సొరంగమార్గాన్ని ప్రారంభించిందన్న ఆరోపణలు ఆదినుంచీ ఉన్నాయి. ఆ టన్నెల్‌ను మధ్యలో వదిలేస్తే సీఎం కేసీఆర్ హయాంలో 30 కిలోమీటర్ల వరకు పూర్తిచేశారు. టన్నెల్ పనుల్లో కీలకమైన బేరింగ్ రిపేర్లకు వస్తే, అది తిరిగి అమెరికా నుంచి రావాలంటే కనీసం 6 నెలలు తీసుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఊటనీటి తో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినా సరే బీఆర్ఎస్ హయాంలో టన్నెల్‌ను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. కొంతమేరకు తవ్వించింది. కానీ, దీనిపై రేవంత్ సర్కార్ అసత్య ప్రచారాలకు పూనుకుంటున్నది. కేసీఆర్ హయాంలో ఒక్క కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదంటూ దేవరకొండ సభలో సీఎం అబద్ధాలు చెప్పడం విస్మయం కలిగిస్తున్నది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ఒకవైపు, జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే, మరోవైపు మున్సిపాలిటీలో ప్రజాపాలన పేరిట సభ పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ఉన్నాయి. సభకు వచ్చిన ఆడబిడ్డల గురించి ప్రస్తావిస్తూ.. అందరికీ ఇందిరమ్మ చీరలు ఇస్తామని చెప్పారు. మహిళలంతా ఇందిరమ్మ చీరలు కట్టుకునిపోయి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. మంత్రినో, ఎమ్మెల్యేనో కలిసి పనులు తేగలిగినవారినే గెలిపించుకోవాలంటూ పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లువేయాలని చెప్పకనే చెప్పారు. గ్రామీణ ప్రజల్ని ప్రభావితం చేసేలా సీఎం ప్రసంగం సాగడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందన్న విమర్శలొస్తున్నాయి.
రాజగోపాల్‌రెడ్డి మళ్లీ డుమ్మా
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి సభకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మంగళవారంతో రెండేండ్లు పూర్తయినా.. నేటికీ ఒక్క సభకు కూడా రాజగోపాల్‌రెడ్డి హాజరుకాలేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్‌కుమార్‌తోపాటు జిల్లాకు చెందిన ఎంపీలు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వేదిక మీద కనిపించలేదు. రాజగోపాల్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పద్మావతీరెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ సైతం సీఎం సభకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.
నాకు గ్రామాల్లో తిరగాలంటే సిగ్గేస్తున్నది ;సీఎం సమక్షంలోనే ఎమ్మెల్యే బాలునాయక్ వ్యాఖ్యలు
నాకు గ్రామాల్లో తిరగాలంటే సిగ్గేస్తున్నది. రోడ్లు బాగోలేవు. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు తలవంచుకొని తిరిగే పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నా’ అంటూ దేవరకొండలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న ప్రజాపాలన విజయోత్సవ సభలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై, తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు.. తమ ప్రభుత్వ ఆసమర్థతను బయటపెట్టుకున్నట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నియోజకవర్గంలో దాదాపు ఇరవై అంశాలకు సంబంధించిన పనులను మంజూరు చేయాలంటూ సీఎంకు విజ్ఞప్తి చేశారు.