హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్ఆర్ఆర్ సమీపంలో సరైన ప్రాంతంలో డ్రైపోర్ట్ ఉండాలని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం ఆయన పలు శాఖలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం..ఆర్ఆర్ఆర్ పనుల పురోగతిపై సమీక్ష ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర పునర్విభజన అంశాలపై ఢిల్లీలో జరిగిన తెలంగాణ, ఏపీ అధికారుల సమావేశంలో హైదరాబాద్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ ఆమోదం తెలపాలని కేంద్రం పనులపై దృష్టిసారించాలని సూచించారు. హైదరాబాద్ నగరాన్ని ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ రహదారికి ప్రతిపాదనలు రూపొందించి ఎన్హెచ్ఏఐకి పంపించాలని అధికారులకు సూచించారు.
ఫ్యూచర్‌సిటీ వరకు మెట్రోను విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. మెట్రో విస్తరణపై జరిగిన సమీక్షలో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉన్నదని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపామని అధికారులు వివరించారు. తాజాగా ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీలోని యంగ్ ఇండియా సిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రోను విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఎం ముఖ్యకార్యదర్శి వీ శేషాద్రి, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బాపూఘాట్ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీర్ఆలం ట్యాంక్‌పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను పరిశీలించారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, బ్రిడ్జితోపాటు ఐలాండ్ జోన్ పక్కనే ఉన్న జూపార్కుకు అనుసంధానం చేయాలని సూచించారు.