హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ‘బీటెక్ ట్యూషన్ ఫీజులను పెంచాల్సిన అవసరం ఉన్నదా? అయినా ఆ విషయం తర్వాత చూద్దాంలే’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కాలేజీల వారీగా ప్రతిపాదిత ఫీజుల పెరుగుదల అంశాన్ని సీఎం ముందుంచారు. ‘ఈ ఫీజులను తగ్గించాలి.. వర్కవుట్ చేద్దాం. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇబ్బందులు కలగొద్దు. ఈ ఫీజులపై తర్వాత చూద్దాం’ అని పేర్కొన్నట్టుగా విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
గతంలో ఇంజినీరింగ్ కాలేజీలపై టాస్క్‌ఫోర్స్ కమిటీ, పోలీసుల తనిఖీ నివేదికలు ఏయ్యాయి? అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆయా నివేదికలను బయటికి తీయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. విద్యాహక్కు చట్టం సెక్షన్ 12 (1)సీ ప్రకారం ప్రైవేట్ స్కూళ్లల్లో 25 శాతం సీట్లు కేటాయించే అంశంపై, యంగ్ ఇండియా గురుకులాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
సమీక్ష సందర్భంగా కొందరు అధికారులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. సమీక్షకు సన్నద్ధమై రాకపోవడం, నివేదికలు, వివరాలను తీసుకురాకపోవడంతో సదరు అధికారులకు అంక్షితలేసినట్టు సమాచారం. ముఖ్యంగా బాగ్‌లింగంపల్లిలోని మైనార్టీ గురుకులానికి తాళాలేయడంతో టీచర్లు, విద్యార్థులు రోడ్డునపడ్డారు. ఈ విషయంపై ఆరా తీసిన సీఎం.. దీనిని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం.
రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. పట్టణీకరణ వేగంగా సాగుతున్న క్రమంలో పురపాలక శాఖతో సమన్వయం చేసుకుని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ వరకు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యాసంస్థలను హేతుబద్ధీకరించాలని ఆదేశించారు.
డే స్కాలర్లకు సైతం నాణ్యమైన భోజనం, గురుకులాల్లో కల్పిస్తున్న వసతుల కల్పనపై అధ్యయనం చేయాలని సూచించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తదతరులు పాల్గొన్నారు.