హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): అనుకున్నదే జరిగింది. సన్నధాన్యం బోనస్‌కు ఎగనామం పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. సన్నధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ చొప్పున అందించే జాబితా నుంచి 30 రకాల సన్నాలను తొలగించింది. ఇకపై ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తుంది. మిగిలిన 30 రకాల సన్నాలకు ఇకపై బోనస్ లేనట్టే. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన వ్యవసాయ శాఖపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… సన్నధాన్యానికి బోనస్ ఇస్తున్న నేపథ్యంలో ఏడు రకాల సన్నవరి విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు ఇవ్వాలని, రైతు వేదికల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్నవడ్లు పండించే రైతుల పూర్తి డాటా సేకరించాలని, ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని స్పష్టంచేశారు. తద్వారా 30 రకాల సన్నాలకు బోనస్ ఇచ్చేదిలేదని తేల్చిచెప్పారు. వాస్తవానికి, కాంగ్రెస్ సర్కార్ 37 రకాల సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని 2024లో నిర్ణయించింది.
క్రమంగా సన్నధాన్యం ఉత్పత్తి పెరుగడం, ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిపోతుండటంతో సన్న రకాలకు కోత పెట్టాలని భావించినట్టు తెలిసింది. దీంతో సూపర్‌ఫైన్ వెరైటీలను మాత్రమే సన్నాలుగా గుర్తించింది. ఈ రకాలకు బహిరంగ మార్కెట్లోనే భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో ఆ ధాన్యం సర్కార్ కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి, ప్రభుత్వంపై కొనుగోలు బాధ్యత తప్పుతుందని, ఆర్థిక భారం కూడా తప్పించుకొనే అవకాశం ఉంటుందని భావించినట్టు తెలిసింది. అందుకే 37 రకాల జాబితా నుంచి 30 రకాలను తొలగించి 7 రకాలకు మాత్రమే బోనస్ హామీని అమలు చేయాలని నిర్ణయించడం గమనార్హం.
రైతువేదికల వద్ద పోలీసులను పెట్టండి
రైతువేదికల ద్వారా విత్తనాలు, ఎరువులు విక్రయించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతి రైతువేదిక వద్ద వ్యవసాయ శాఖతోపాటు రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒకో అధికారిని అందుబాటులో ఉంచాలని, ఎరువులు, విత్తనాల పంపిణీలో గొడవలు, ఆందోళనలు జరుగకుండా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాల్లో రైతువేదికల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. రైతులు ఎకడా ఇబ్బందులు పడకుండా వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఇప్పుడే ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని అదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, సివిల్ సైప్లెస్ మేనేజింగ్ డైరెక్టర్, ప్లానింగ్ విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
అన్ని ఎరువులు యాప్ ద్వారానే
ప్రస్తుతం యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నట్టుగానే ఇకపై అన్ని రకాల ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసే విధానం తీసుకొని రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకొన్న యూరియాను రైతువేదికల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా పంపిణీ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని చెప్పారు. వానకాలానికి అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ముఖ్యమంత్రి సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొనిరావాలని చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి, వాస్తవ పరిస్థితిని వివరించాలని సూచించారు. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని చెప్పారు.