PRLIS | మహబూబ్‌నగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోని అతిపెద్దదైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టింది. 2023 డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పాలనకు ఏడాది దాటినా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా కేటాయించలేదు. ఫలితంగా సాగునీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి వచ్చి మూడు నెలల తర్వాత పాలమూరుకు వచ్చిన సీఎం ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తూ ప్రతినెలా అన్ని ప్రాజెక్టుల స్థితిగతులపై అధికార యంత్రాంగంతో చర్చించాలని ఆదేశించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్న సీఎం ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి.
మరోవైపు కృష్ణ బేసిన్లో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నది. తాజాగా దొంగే దొంగ అన్నట్టు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కృష్ణా ట్రిబ్యునల్‌కు ఏపీ ఫిర్యాదు చేయడం.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సొంత జిల్లాకు చెందిన సీఎం ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంపై వచ్చే యాసంగి నాటికి సాగునీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 95 శాతానికిపైగా పూర్తయిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఈ ఎత్తిపోతల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా నిర్మాణ పనులు చేపట్టింది. 2023 అక్టోబర్‌లో కేసీఆర్ కొల్లాపూర్ సమీపంలో పాలమూరు లిఫ్ట్-1 ట్రయల్న్‌న్రు ప్రారంభించి జిల్లా ప్రజలకు అంకితం చేశారు. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇటీవలి వరకు పనులు చేపట్టారు. ఈ పథకంలో భాగంగా ప్రధానమైన పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్ల నిర్మాణం దాదాపుగా పూర్తికావచ్చింది. ఒక్క ఉదండాపూర్ రిజర్వాయర్ మాత్రమే నిర్మాణ దశలో ఉన్నది. కొల్లాపూర్ సమీపంలోని ఎల్లూరు రిజర్వాయర్ పూర్తి కావడంతోపాటు దాదాపు రెండు టీఎంసీల నీటిని నిల్వచేశారు. అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్‌కు గ్రావిటీ ద్వారా వచ్చే కెనాల్ వర్క్ పూర్తి కావాల్సి ఉన్నది. ఏదుల వట్టెం, ఉదండాపూర్ పంప్‌హౌస్ నిర్మాణం పూర్తి కావడంతోపాటు బాహుబలి పంపులను కూడా బిగించారు. ఇటీవల వట్టెం పంప్లో మూడు పంపులను డ్రైరన్ చేపట్టి విజయవంతం చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్రదాయిని పాలమూరు ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. దాదాపు 12 లక్షలకు పైగా ఎకరాలకు నీరు అందించే పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి కాంగ్రెస్ నేతలు ఊసే ఎత్తడం లేదు. గుత్తేదారులు పనులను నిలిపివేసి వెళ్లిపోయారు. కొందరు అధికారులు మాత్రమే పర్యవేక్షిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సర్కార్ సిద్ధంగా ఉన్నదని, ప్రతినెలా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలతోపాటు పాలమూరు ప్రాజెక్టుపైనా సమీక్ష జరపాలని సంబంధిత మంత్రితోపాటు అధికారులనూ ఆనాడు సీఎం ఆదేశించారు. కానీ ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పెండింగ్ ప్రాజెక్టులపై ఆ ఊసే లేదు. అధికార యంత్రాంగం కూడా సర్కారుకు ఫైల్‌నోట్ ద్వారా నివేదించినా ప్రభుత్వంలో ఉలుకూ లేదు పలుకూ లేదు.
భారీ వర్షాలతో నిండిన జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో ఉన్న నీటిని సాగుకు క్రమంగా వదులుతున్నారు. దీంతో యాసంగి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. కృష్ణా బేసిన్లో మార్చి వరకు సాగు, తాగునీటికి ఢోకా ఉండదని భావించారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి పాల్పడుతుండటంతో జనవరి నెలాఖరు నాటికే శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. కేఎల్ఐకీ నీరందని పరిస్థితి దాపురించింది. ఈ పథకానికి గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా అవి కూడా నీటి మూటలుగానే మారిపోయాయి. ఈ పథకానికీ నయా పైసా విదిల్చలేదు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగికి సాగునీరు అందుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాలని రైతాంగం కోరుతున్నది.