హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ) : పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సీఎం రేవంత్‌రెడ్డి లెక్కచేయడం లేదా? ఆయన్ను పక్కపెట్టాలని భావిస్తున్నారా? ఇటీవల అప్పులపై జబ్బలు చరిచి.. ‘విషయం’ లేకుండానే సవాల్ చేసిన జూపల్లి.. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారని అనుకుంటున్నారా? సోమవారం టూరిజంపై సంబంధిత శాఖ మంత్రి లేకుండానే ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నది. పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో జరిపిన ఈ రివ్యూ మీటింగ్‌కు ఆ శాఖ మంత్రి జూపల్లికి ఆహ్వానం లేనట్టు తెలిసింది. ఇదిలా ఉంటే సదరు మంత్రి మాత్రం సొంత నియోజకవర్గంలో సరదాగా ఈతకొట్టడం గమనార్హం.
బీఆర్ఎస్తో పెట్టుకొని చులకన..
మంత్రి జూపల్లి కృష్ణారావు తనకు సంబంధంలేని అప్పుల సబ్జెక్టులో తలదూర్చారు. బీఆర్ఎస్ ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసింది, అన్ని చేసిందంటూ ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా చర్చించేందుకు బీఆర్ఎస్ ఆఫీస్‌కు వస్తానని, దమ్ముంటే కేటీఆర్, హరీశ్‌రావు రావాలంటూ సవాల్ విసిరి హంగామా చేశారు. మంత్రి సవాల్‌ను స్వీకరించిన హరీశ్‌రావు పక్కా ఆధారాలతో జూపల్లిని ఉతికి ఆరేశారు. బీఆర్ఎస్ దూకుడు వ్యవహరించి కౌంటర్ అటాక్ చేయగా, ఊహించని ఈ పరిణామంతో మంత్రి పరువు పోయింది. అందుకే సొంత శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేస్తే ఆయనకు పిలుపులేకపోవడంతో మంత్రికున్న విలువ ఏమిటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
సబ్జెక్ట్ లేకుండా సవాల్‌పై సీరియస్?
ఈ సవాళ్ల ఎపిసోడ్లో జూపల్లి కారణంగానే ప్రభుత్వం పరువుపోయిందని సీఎం అభిప్రాయం పడినట్ట్టు తెలిసింది. దీనిపై ఇటీవలి క్యాబినెట్ లోనూ ప్రస్తావించినట్టు సమాచారం. సబ్జెక్టు లేకుండా సవాల్ విసరడం ఎందుకు, పరువు పోగొట్టుకోవడం ఎందుకని సీరియస్ అయినట్టు తెలిసింది. అందుకే మంత్రిని సమీక్షకు ఆహ్వానించలేదని సమాచారం.
మీటింగ్‌లో ఏం జరిగిందని జూపల్లి ఆరా?
తనకు తెలియకుండా తన శాఖపై సమీక్ష నిర్వహించడంపై మంత్రి జూపల్లి ఒకింత మనస్తాపం చెందినట్టు తెలిసింది. పర్యాటక శాఖపై సీఎం సమీక్షిస్తున్నారనే విషయాన్ని అధికారుల ద్వారా తెలుసుకొని తీవ్ర ఆవేదన చెందారని సమాచారం. సమీక్ష ముగిసిన తర్వాత అధికారుల ద్వారా సమావేశం విషయాలపై జూపల్లి ఆరా తీసినట్టు తెలిసింది. మీటింగ్‌లో ఏం జరిగింది?, సీఎం ఎలాంటి ఆదేశాలు ఇచ్చారో తెలుసుకున్నారని సమాచారం. ‘సమావేశానికి ఎలాగూ ఆహ్వానించలేదు.. కనీసం ఈ నిర్ణయాల అమల్లో అయినా పట్టించుకుంటారా? లేక పక్కన పెడుతారా’ అని అధికారులతో మంత్రి పలు వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.