హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాల్లో ఏవైనా రెండు ఎంపిక చేసి అమలు చేస్తామని తెలిపారు. వాటికోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలపై ఆయా విభాగాల అధికారులతో చర్చించారు. మూడు గ్యారెంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఒకో గ్యారెంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది, ఎంతమందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి క్యాబినెట్ సబ్‌కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఐదు గ్యారెంటీలకు మొత్తం 1,09,01,255 దరఖాస్తులు రాగా, గత నెల 12 నాటికి వాటి డాటా ఎంట్రీ పూర్తయినట్టు అధికారులు సీఎంకు నివేదించారు. ఇందులో కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నంబర్లు లేవని తెలిపారు. మొత్తం 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు గుర్తించామన్నారు. వాటిని మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు.
దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఎంపీడీవో ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డిజీపీ రవిగుప్తా, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ హాన్, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, హోం శాఖ కార్యదర్శి జితేందర్, సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారుల పట్ల కఠినంగా ఉంటామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లను విద్యుత్తు అధికారులు తనిఖీ చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని, తనిఖీలు చేయాలని ఎవరు ఆర్డర్ ఇచ్చారని ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీని ప్రశ్నించారు. దీంతో డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార స్పందిస్తూ. శాఖాపరమైన నిర్ణయమేదీ లేకుండానే డిసం డైరెక్టర్ (ఆపరేషన్స్) జే శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చారని, ఈ మేరకు ఎస్ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి తనిఖీలు చేశారని చెప్పారు. దీంతో శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలిగించామని, ఎస్ఈని బదిలీ చేశామని తెలిపారు.