CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించి, ఏడాది పాలనా సంబురాలు ఏ ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న వనరుల వినియోగం మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంతనాలు జరిపినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో ప్రజలు, పోలీసుల నిరసనలకు బీఆర్ఎస్ పార్టీనే కారణమని, ఆ పార్టీని నిలువరించటం ఎలా అనే అంశం మీద చర్చించినట్టు సమాచారం. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మంతనాలు చేశారు. ఉదయం 10 గంటలకు ముందుగానే సీఎం ఇంటికి చేరుకున్న భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్‌రెడ్డి రెండు గంటలపాటు ఏకాంతంగా మాట్లాడారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారితో జత కలిశారు. ముగ్గురు కలసి ముఖ్యమంత్రి ఇంటి వద్దనే మధ్యాహ్న భోజనం చేశారు. వారు అధికారిక కార్యక్రమాలకు వెళ్లకుండా పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది.
వచ్చే డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి ఏడాది అవుతుంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు కావడంతో ఏడాది పాలనా సంబురాలు, పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. సొనియా పుట్టిన రోజును పురస్కరించుకొని ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహాలక్మి పథకంలోని కీలక హామీ అయిన మహిళలకు ప్రతి నెలా రూ.2500 భృతిని అమలు చేద్దామా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించగా.. ఇప్పు డు ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, మహాలక్ష్మి పథకం అమలు సాధ్యం కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఏడాది పాలనా సంబురాల్లో కేవలం ఆర్థికేతర అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని భట్టివిక్రమార్క ముఖ్యమంత్రికి సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అన్ని వర్గాలు పరిపాలన మీద ఆగ్రహంతో ఉన్నాయని, రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అమలు కాకపోవటంతో రైతులు, ఏక్ పోలీసు విధానం అంటూ టీజీఎస్పీ పోలీసులు తలనొప్పిగా మారారని, వారిని బీఆర్ఎస్ నేతలే ప్రభుత్వం మీదికి ఉసిగొల్పుతున్నారని చర్చించినట్టు తెలుస్తున్నది. బెటాలియన్ పోలీసు కుటుంబాల మెరుపు ధర్నాను పసిగట్టడంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందని వారు భావిస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ చీఫ్‌తో దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడినట్టు సమాచారం.
దీపావళి టపాసుల కంటే ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన విషయం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కేంద్రంగా ఆయన బావమరిది రాజ్ పాకాల ఇంటి చుట్టు అల్లిన ఉచ్చులో అనుకున్న ఫలితాలు సాధించటంలో విఫలం అయ్యామని, ఎస్వోటీ పోలీసులకు కాకుండాఎక్సైజ్ అధికారులకు ఇంత పెద్ద పని అప్పగించటమే ఫెయిల్యూర్‌కు కారణమని బాధపడ్డట్టు తెలిసింది. వారు ఆశించిన స్థాయిలో దాడులు చేయలేకపోయారని, కేసులు పెట్టలేకపోయారని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అక్కడ జరుగుతున్నది రేవ్ పార్టీ అని ప్రజలను నమ్మించగలిగి ఉంటే పరిస్థితి మరో తీరుగా ఉండేదని అనుకున్నట్టు తెలసింది. దక్షిణ కొరియా టూర్లోనే ప్రకటించిన పొలిటికల్ బాంబుల వ్యాఖ్యలు బలంగా జనంలోకి వెళ్లాయని, మీడియా దృష్టి కూడా పూర్తిగా పొలిటికల్ బాంబుల మీదనే ఉందని, మీడియా మూడ్‌ను అదే ట్రాక్‌లో కొనసాగించటం ద్వారా తమ పని చేసుకొనిపోవచ్చని వ్యూహరచన చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్, ఓఆర్ఆర్ లీజు అంశాల మీదనే సుదీర్ఘంగా చర్చ సాగినట్టు సమాచారం. ఈ కేసుల పురోగతి మీద మీడియాకు లీకులు ఇవ్వటం ద్వారా బీఆర్ఎస్ నేతలను కొంత మేరకు ఆత్మరక్షణలో పడేయవచ్చని, తద్వారా వాళ్ల దూకుడుకు కళ్లెం వేయవచ్చని భావించినట్టు తెలిసింది. అటు మీడియాకు కూడా పూర్తి సమయం వీటితో సరిపోతుంది కాబట్టి ఇప్పుడున్న నిరసన సెగలను సునాయాసంగా కట్టడి చేయవచ్చని అనుకున్నట్టు తెలిసింది.