హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం లేకుండానే వానకాలంలో పంటల దిగుబడి భారీగా పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం చూస్తుంటే ఆయనకు ఈ ప్రాజెక్ట్‌పై అవగాహన లేదనే విషయం స్పష్టమవుతున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఎద్దేవాచేశారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చి, 24 గంటల కరెంట్ సరఫరా చేసి, చెరువులను పునరుద్ధరించి రైతాంగానికి ధైర్యమిచ్చినందునే దండిగా పంటలు పండాయని చెప్పారు. చెరువులు, ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి తీయని, మెగావాట్ కరెంట్ కూడా ఉత్పత్తి చేయని రేవంత్‌రెడ్డి పుట్డెడు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో హిమాలయాల ఎత్తుకు పెరిగిన తెలంగాణ ప్రతిష్టను రేవంత్‌రెడ్డి ఏడాదిలోనే అథఃపాతాళానికి దిగజార్చారని దుయ్యబట్టారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోలేదని చెప్తున్న రేవంత్‌రెడ్డి.. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటిని ఎలా తరలించారో చెప్పాలని నిలదీశారు. ‘పంపులు ఆన్ చేయకుండానే ఎత్తిపోశారా?.. ఈ ప్రాజెక్టులు కాళేశ్వరంలో భాగం కావా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మాత్రమే కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. సోమవారం ఆయన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నాయకులు కిశోర్‌కుమార్, దూదిమెట్ల బాలరాజుతో కలిసి తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014-15లో 26 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, కేసీఆర్ పదేండ్ల పాలనలో 67 లక్షల ఎకరాలకు పెరిగిందని గుర్తుచేశారు. ఎత్తుపై ఉన్న తెలంగాణ ప్రాంతానికి ప్రాణిహిత నుంచి నీరందించేందుకే బృహత్తర కాళేశ్వరం నిర్మించారని చెప్పారు. ఈ ప్రాజెక్టు అవసరమే లేదని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మూసీలోకి మల్లన్నసాగర్ నీటిని ఎలా తరలిస్తారో చెప్పాలని నిలదీశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది చొప్పు న కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు తెలంగాణకు ఏం ఒరగబెట్టారని వినోద్ నిలదీశారు. ఏడాది దాటినా మేడిగడ్డను ఎందుకు బాగు చేయించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలుంటే ఏనా డో మేడిగడ్డ బాగయ్యేదని చెప్పారు. కాళేశ్వరం అనుమతుల కోసం ఢిల్లీలోని సీడబ్ల్యూసీ, నీటిపారుదల శాఖ అధికారుల చుట్టూ రేయింబవళ్లు తిరిగి సాధించామని గుర్తుచేశారు. భారీ వర్షాలను తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డపై సీఎం దుష్ప్రచారం చేయడం విడ్డూరమని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన విజయోత్సవాలు కాకుండా ప్రజా వంచనోత్సవాలు జరుపుకొంటే బాగుంటుందని ఎద్దేవాచేశారు. లగచర్లలో గిరిజన మహిళలపై పోలీసులు దాష్టీకం చేసినా సీతక్క స్పందించకపోవడంలోని అంతర్యమేమిటని నిలదీశారు. ఆమె సీఎం రేవంత్‌కు తొత్తుగా మారినందునే మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.