హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నగరాభివృద్ధికి అడ్డుపడేలా కాళ్లల్లో కట్టెలు పెట్టేవారిని తప్పకుండా శిక్షిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శనివారం ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్‌గూడలో లెవల్-2 ఫ్లైఓవర్‌ను, ఉప్పల్ నియోజకవర్గంలో రెండు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ప్రారంభించిన సీఎం.. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ మార్గంలో నిర్మించనున్న ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు.
బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీలో ఇటీవల శంకుస్థాపన చేసిన మెట్రో ప్రాజెక్టును కొందరు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు కేంద్రాన్ని ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు.
పేదలకు మెట్రోరైల్‌ను అందుబాటులోకి తెచ్చేలా నాగోల్ నుంచి ఎల్బీనగర్-ఒవైసీ హాస్పిటల్-చంద్రాయణగుట్ట నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించనున్నామని తెలిపారు. రవాణావసతుల డిమాండ్ నేపథ్యంలో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, గచ్చిబౌలి నుంచి అమెరికన్ కాన్సులేట్ వర కు, కొత్తగా రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో చేపట్టిన హైకోర్టు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మెట్రోను విస్తరించనున్నట్టు వివరించారు.
బీహెచ్ఈఎల్ వరకు మెట్రో అందుబాటులోకి వచ్చేలా విస్తరణ ప్రణాళికలను రూపొందించిన ట్టు తెలిపారు. కాలుష్యం కారణంగా నల్లగొండ, హైదరాబాద్‌కు శాపంలాగా మారిన మూసీ నదిని రూ.50 వేల కోట్లతో లండన్‌లోని థేమ్స్ నది తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ఇందుకు వైబ్రంట్ తెలంగాణ-2050 ప్రాజెక్టు పేరిట మూసీ రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా, తెలంగాణ జిల్లాల సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాలను అర్బ న్, సబర్బన్ హైదరాబాద్, రూరల్ తెలంగాణగా విభజించి మెగా మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయనున్నామని, ఇందుకు అంతర్జాతీయ ప్లానింగ్ సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని అన్నారు.