హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి హరీశ్‌రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, గత డిసెంబర్ 9నాటికే రైతులకు రెండు లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ అన్ని వర్గాల ప్రజలను వంచించిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవీప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు.
ఆరు గ్యారెంటీలకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలు బుట్టదాఖలయ్యాయని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్ట్ 15లోగా అమలు చేస్తామని మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నాన్ని ప్రజాపక్షం వహించిన హరీశ్‌రావు అడ్డుకున్నారని, ఆరు గ్యారెంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేయకుంటే సీఎం రాజీనామా చేయాలని, అమలు చేస్తే తాను రాజీనామా చేస్తామని హరీశ్ ప్రకటించారని వివరించారు.
నాడు చాలెంజ్‌కు ముందుకు రాని ముఖ్యమంత్రి, ఆ చాలెంజ్ వల్ల అనివార్యంగా ఇప్పుడు కేవలం లక్ష వరకు అదీ కొందరికే లబ్ధికలిగేలా 6వేల కోట్లు మాత్రమే వేసి సంబురాలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. ఇంకా 25 వేల కోట్ల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేయకుండా హరీశ్‌రావును రాజీనామా చేయాలని సీఎం, ఇతర కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం ప్రజాపక్షంగా నిలబడే హరీశ్‌రావుపై వారికున్న అకసును తెలియజేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పదవులకు రాజీనామా చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని, ఇప్పటికైనా హామీలను కోతలు లేకుండా అమలుచేయాలని సూచించారు. అమలు చేసి అన్నీ అమలు చేశామనే దబాయింపును ఇకనైనా ఆపాలని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలుచేసే దాకా ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రజల పక్షాన పోరాడుతామని ప్రకటించారు.
రైతుల రుణమాఫీ మాదిరిగానే చేనేత సహకార సంఘాలు, కార్మికుల వ్యక్తిగత రుణాలనూ మాఫీ చేయాలని చేనేత కార్మికసంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెంకట్రాములు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.