హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలందరికీ చట్టబద్ధ మార్గదర్శిగా, అత్యంత ఆదర్శంగా నిలువాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దొంగ ఓట్ల వ్యవహారం ఆధారాలు సహా బట్టబయలైంది. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ద్వారా ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో, రెండు వేర్వేరు పార్లమెంట్ స్థానాల పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రెండు ఓట్లు ఉన్నట్టు అధికారిక ఓటర్ల జాబితా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నికల నియమాలు గాలికి
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి చట్టాలను రక్షించాల్సిన ముఖ్యమంత్రే దేశ ప్రాథమిక ఎన్నికల నియమాలను గాలికొదిలేశారు. ఇటీవలే తాను జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని, 20 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానంటూ అట్టహాసంగా, హంగామాగా వేడుకలు జరుపుకొన్నారు రేవంత్‌రెడ్డి. అయితే, రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి దేశంలో ఒక పౌరుడికి రెండు ఓట్లు ఉండకూడదనే ప్రాథమిక చట్టం తెలియకపోవడం అత్యంత విచారకరమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్-17 ప్రకారం దేశంలో ఏ పౌరుడైనా సరే ఒకటి కంటే ఎకువ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు కాకూడదు. సెక్షన్-18 ప్రకారం ఒకే నియోజకవర్గంలో రెండు ఓట్లు ఉండొద్దు. ఇలాంటి తప్పులకు పాల్పడితే సెక్షన్-31 ప్రకారం నేరం రుజువైతే ఏడాది జైలు శిక్ష, జరిమానా లేదా రెండు విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరస్థుడే. ఆయన తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ వస్తున్నది. చట్టాలను
అప్పుడే ఎందుకు తొలగించుకోలేదు?
ఈ రెండు ఎంట్రీలలోనూ ముఖ్యమంత్రి పేరును Revanth అని రాయడానికి బదులుగా Revant అని తప్పుగా ముద్రించారు. కనీసం తన పేరు స్పెల్లింగ్ సరిచూసుకోవడంలోనూ, చట్టవిరుద్ధంగా ఉన్న డూప్లికేట్ ఓటును ఫామ్-7 ద్వారా తొలగించుకోవడంలోనూ సీఎం పూర్తి నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ దొంగ ఓట్ల వ్యవహారం బయటకు రాగానే ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాల్సింది పోయి, సీఎం ఆఫీస్ పరిధిలోని ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ రంగంలోకి దిగి వివరణ ఇవ్వడం ఏంటి? అసలు ఎన్నికల కమిషన్‌ను నడిపేది రేవంత్‌రెడ్డా? లేక ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డా? మళ్లీ ఆ ఫ్యాక్ట్ చెక్ పోస్ట్‌ను రాత్రికి రాత్రే ఎందుకు డిలీట్ చేశారు? అనే అనుమాలు తలెత్తుతున్నాయి.
కలెక్టర్ వివరణపై అనుమానాలు
నాగర్‌కర్నూల్ కలెక్టర్ మంగళవారం మీడియా ముందుకొచ్చి రేవంత్‌రెడ్డికి అచ్చంపేట పరిధిలో ఇప్పుడు ఓటు లేదని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి 2023 ఎన్నికల అఫిడవిట్లో తాను కొడంగల్ ఓటరునని చెప్పారని నెటిజన్లు గుర్తుస్తున్నారు. మరి కొండారెడ్డిపల్లి ఓటును ఎప్పుడు, ఎలా తొలగించారు? ఓటు తొలగించే ముందు రేవంత్‌రెడ్డికి నోటీసు ఇచ్చారా? ఫారం-8 లేదా ఫారం-7 ద్వారా రేవంత్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారా? సీఎం సంతకం లేకుండా ఓటు ఎలా తొలగిస్తారు? ఒకవేళ రాత్రికి రాత్రే ఓటు రికార్డులను మాయం చేస్తే, కలెక్టర్ కూడా బీఎన్ఎస్ చట్టం ప్రకారం ఆధారాలను నాశనం చే సినందుకు నేరస్థుడవుతారని అంటున్నారు.
ఒకే ఎపిక్ నంబర్.. రెండు ఓట్లు
తాజాగా వెలుగులోకి వచ్చిన ఓటరు తుది జాబితా-2025 ప్రకారం (ప్రచురణ తేదీ: 06-01-2025), రేవంత్‌రెడ్డి ఒకే ఒక ఎపిక్ నంబర్ (టీఈఎస్0274035)తో వేర్వేరు జిల్లాల్లో, రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్‌గా నమోదై ఉన్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం-72 పరిధిలోని పార్ట్ నంబర్ 237, సెక్షన్-2 (శాంతినగర్)లో సీరియల్ నంబర్ 974తో ఇంటి నంబర్ 1-209పై ఒక ఓటు ఉన్నది. నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం, అచ్చంపేట (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం-82 పరిధిలోని పార్ట్ నంబర్ 16, సెక్షన్-2 (ఈదమమ్మ టెంపుల్)లో సీరియల్ నంబర్ 601తో వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని సొంత ఇంటి నంబర్ 3-48పై మరో ఓటు ఉన్నది.