Phone Tapping | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్, మాజీ మంత్రులు, ఇతర బీఆర్ఎస్ ముఖ్యనేతల ఫోన్లన్నీ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చెప్పారు. ముఖ్యంగా తన ఫోన్లు ట్యాప్ చేసి, తాను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకుంటూ, తనని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు సీఎం, ఇంటెలిజెన్స్ డీజీ కుట్రపన్నారని వెల్లడించారు. ఈ మేరకు తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘బంజారాహిల్స్ ఏసీపీకి పొద్దున్నే ఫోన్‌చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మన్నారు. నేను పోలీస్ స్టేషన్‌కు 3 గంటలకు వెళ్లేసరికే ఏసీపీ ఐదు నిమిషాల ముందే వెళ్లిపోయారు. నేను సీఐకి ఫిర్యాదు ఇద్దామని వెళ్తే ఆయన స్టేషన్ నుంచి వెళ్లి పోయేందుకు ప్రయత్నించారు. నా ఫిర్యాదు తీసుకోవల్సిందేనని పార్టీ కార్యకర్తలు పట్టుబట్టడంతో వెనక్కి వచ్చి ఫిర్యాదు తీసుకొని, రసీదు ఇచ్చారు.
నేను ఒక ఎమ్మెల్యేను అన్న గౌరవం లేకుండా సీఐ అనుచితంగా ప్రవర్తించారు’ అని కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. డీజీపీ కన్నా ఎకువ ప్రొటోకాల్ ఎమ్మెల్యేకు ఉంటుందన్న విషయం సీఐకి తెలియదా? అని ప్రశ్నించారు. ‘కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలువని ముఖ్యమంత్రి సోదరులు స్టేషన్లకు వస్తే కుర్చీల్లోంచి లేచి వెళ్లి మరీ వంగి వంగి దండాలు పెట్టే పోలీసులకు.. ఓ ప్రజాప్రతినిధి వస్తే ఎలాంటి మర్యాద ఇవ్వాలో తెలియదా?’ అని నిలదీశారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన ఏ ఒక్క అధికారిని కూడా వదిలేది లేదని హెచ్చరించారు.
ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్‌ను ట్యాప్ చేయించి తన కదలికలను పసిగడుతున్నారని కౌశిక్‌రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ఓ ఈవెంట్‌కు వెళ్లేందుకు మాట్లాడిన కాల్స్‌ను ట్యాప్ చేశారని, ఆ సమాచారంతో ఆ ఈవెంట్లో డ్రగ్స్ పెట్టించి, తనను ఆ కేసులో ఇరికించాలనే కుట్ర చేశారని కౌశిక్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం తర్వాత తన ఫోన్‌ట్యాప్ అవుతున్నదనే విషయాన్ని గుర్తించి, తన ఆఫీసు, పార్టీ ఆఫీసు బంజారాహిల్స్ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి.. ఇక్కడ ఫిర్యాదు చేశానని చెప్పారు.
కచ్చితంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ శివధర్రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందేనని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుపై ఓ బ్రోకర్ సూచనతో మరో బ్రోకర్ ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అలాగే నా కేసులో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి’ అని డిమాండ్ చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి తప్పడం వల్లే తెలంగాణలో భూకంపం వచ్చిందని కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ‘సీఎం ఎక్కడికి వెళ్లినా దేవుళ్ల మీద ఒట్లుపెట్టి, అబద్ధాలు చెప్తుండడం వల్లే దేవుళ్లు ఆగ్రహంతో భూకంపమనే సిగ్నల్ ఇచ్చారేమో’ అని అనుమానించారు. ఇకనైనా సీఎం అబద్ధాలు చెప్పవద్దని సూచించారు. దేవుళ్ల మీద ఒట్లు వేసిన పాపమంతా రేవంత్‌రెడ్డిదేనని చెప్పారు. అధికారులు, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
‘కరీంనగర్ సీపీ, మానకొండూర్ సీఐకి టెలీకాన్ఫరెన్స్ పెట్టడం లేదనే కాన్ఫిడెన్షియల్ విషయం మానకొండూర్ ఎమ్మెల్యేకు ఎలా తెలుసు?’ అని ప్రశ్నించారు. కరీంనగర్ సీపీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. లేదంటే సీపీ, సీఐలు ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయాన్ని మీడియాకు చెప్పాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, ముఠా జైసింహ, ప్రశాంత్ కుమార్‌రెడ్డి, కురవ విజయ్‌కుమార్, బొమ్మెర రామ్మూర్తి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, కరాటేరాజు పాల్గొన్నారు.