నిజామాబాద్: రైతు రుణమాఫీ అమలులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) విమర్శించారు. కనీసం సగం మందికి కూడా రుణాలు మాఫీ చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తే.. కనీసం సగం మందికి కూడా చేయలేదని విమర్శించారు.
జిల్లాలో రైతు రుణమాఫీ కేవలం 30 శాతం మాత్రమే జరిగిందని వివరించారు. గత పాలకులకు, రేవంత్ రెడ్డికి తేడా లేదన్నారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని సూచించారు. పనికిమాలిన కండిషన్లు పెట్టి రైతులను దగా చేశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్రెడ్డి మోసం చేశారని విమర్శించారు. మొదటి హామీ అమలులోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ విలీనం కాదని స్పష్టంచేశారు.