హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గోబెల్స్‌ను మించిపోయి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదనడం చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో లక్షా అరవై ఒక్కవేల పోస్టులు భర్తీ చేసింది నిజంకాదా? అని సోమవారం ఆయన ఎక్స్ వేదికగా నిలదీశారు.
ఒక్క పోలీసు శాఖలోనే 31,731 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరో 16,337 ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చామని, రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ సైతం పూర్తిచేశామని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్ రావడంతో నియామకపత్రాలు ఇవ్వలేకపోయామని వివరించారు. ఆయా పోస్టులను తామే భర్తీ చేసినట్టు రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ‘పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులకు ఈ విషయం తెలియదనుకుంటున్నవా రేవంత్?’ అని ఎద్దేవా చేశారు.
90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిస్సిగ్గుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనే హాల్‌టికెట్లు ఇచ్చి, పరీక్షలుపెట్టి, ఫలితాలు ప్రకటించారని, వంటంత అయినంకా వచ్చి గంటె తిప్పిన చందంగా సీఎం రేవంత్ వ్యవహారం ఉన్నదని విమర్శించారు. అబద్ధాలు చెప్తున్న రేవంత్‌రెడ్డిని నిరుద్యోగులు నమ్మబోరని, తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.