Gummadi Narsaiah | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్, న్యూ డెమోక్రసీ) నాయకుడు గుమ్మడి నర్సయ్యకు సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్లో గుమ్మడి నర్సయ్య ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కాగా ఈ భేటీ అసెంబ్లీ ప్రాంగణంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గుమ్మడి నర్సయ్య రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించారు.
సచివాలయంలో, అసెంబ్లీ వద్ద, చివరికి జూబ్లీ హిల్స్‌లోని సీఎం నివాసం వద్ద పడిగాపులు కాశారు. తన నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని తలపోశారు. ప్రతిసారి ఆయనకు నిరాశే ఎదురైంది. ‘ఐదుసార్లు ఎమ్మెల్యే..అయినా దొరకని సీఎం అపాయింట్మెంట్’ అని నమస్తే తెలంగాణ సహా పలు ప్రచార మాధ్యమాల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ నేపథ్యంలో సీఎం అపాయింట్మెంట్ ఇవ్వటం చర్చనీయాంశమైంది. భేటీపై గుమ్మడి నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘కలిసినవా.. అంటే కలిసిన’ అన్నట్టుగా సమావేశం జరిగిందని చెప్పారు. ‘సీఎంను కలిశాం. చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పినం’ అని తెలిపారు. త్వరలో అందరినీ పిలిచి మాట్లాడతా.. మిమ్మల్ని కూడా పిలుస్తా’ అని సీఎం చెప్పారని అన్నారు.