హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగే ఈ కేసు విచారణకు రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో జరిగిన ప్రచార సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ.. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల వల్ల బీజేపీ పరువుకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ కేసును కొట్టేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ వేయాలని కాసం వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీచేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను జూన్ 13వ తేదీకి వాయిదా వేశారు.