హైదరాబాద్, మార్చి 22(నమస్తే తెలంగాణ): సీజన్‌కు ముందే యూరియా పంపిణీపై సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారు. వానకాలానికి యూరియా కొరత తప్పదని స్వయంగా వెల్లడించారు. ఇందుకు రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ యూరియా కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో యూరియా కొరత వస్తుందని స్పష్టంచేశారు. దీన్ని అధిగమించేందుకు రైతులు నానో యూరియా వైపు మారాలని పిలుపునిచ్చారు. ‘మనకు విదేశాల నుంచే యూరియా రావాల్సి ఉంటుంది. యుద్ధం కారణంగా అవసరమైన స్టాక్ రాకపోవచ్చు. అందుకే మన వద్ద ఉన్న రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే యూరియాను రాష్ర్టానికే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నం. లేనిపక్షంలో రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత తీవ్రమవుతుంది’ అని చెప్పారు.
బఫర్ నిల్వలు సున్నా
బీఆర్ఎస్ హయాంలో సీజన్‌కు ముందే కేసీఆర్ రాష్ట్రంలో కనీసం 4 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు తీసుకునేవారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత బఫర్ స్టాక్‌పై పూర్తిగా విఫలమైంది. సీజన్‌కు ముందే యూరియా నిల్వల్ని సమకూర్చడంలో ఘోరంగా ఫెయిలయింది. అందుకే రైతులు యూరియా కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే వానకాలంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడబోతున్నది. సీజన్లో సుమారు 10 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుంది. కానీ ప్రభుత్వం వద్ద 4 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్‌కు బదులు 50 వేల టన్నులు కూడా లేనట్టు తెలుస్తున్నది. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పిన లెక్కలివి. వానకాలం ప్రారంభానికి ముందు రాష్ట్రం వద్ద 50 వేల టన్నుల యూరియా నిల్వలు కూడా ఉండే అవకాశం లేదని ఇటీవల కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తమకు ప్రతి నెలా 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరారు. కానీ ఇలా లేఖలు రాయడమే తప్ప రైతుల కోసం ఢిల్లీ వెళ్లి యూరియా తీసుకొచ్చే చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదే పదే అధిష్ఠానం పెద్దల్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి, రైతుల కోసం, యూరియా కోసం ఎందుకు వెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తప్పని యూరియా తిప్పలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఒక్క బస్తా కోసం రైతులు యుద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. గతంలో ఆటో వాళ్లకు పైసలిస్తే ఇంటికొచ్చే యూరియా ఇప్పుడు దుకాణాల ముందు రోజుల తరబడి పడిగాపులు కాసినా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో వానకాలం యూరియా కొరత తాండవం చేసింది. ఎండ, వాన, చలి అనే లేకుండా, రాత్రి, పగటలు అనే తేడా లేకుండా తిండి తిప్పలు లేకుండా రైతులు దుకాణాల ముందు పడిగాపులు కాశారు. మళ్లీ గతంలో మాదిరిగా యూరియా పోలీసుల పహారాలో విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పుల లైన్లు మళ్లీ దర్శనమిస్తున్నాయి. యాసంగిలో రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక.. క్యూలు కనిపించకుండా కాంగ్రెస్ సర్కార్ యాప్‌ను తెచ్చింది. తద్వారా రైతులను మరింత గందరగోళంలోకి నెట్టింది. కనీసం వచ్చే సీజన్లో అయినా యూరియా కొరత తీరుతుందేమోనని రైతులు ఆశపడ్డారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో మరోసారి యూరియా కొరత తప్పదనేది స్పష్టమైంది. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. స్వయంగా సీఎం యూరియా కొరత వస్తుందని, పంపిణీ చేయలేమని ప్రకటనలు చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.