Revanth Reddy | హైదరాబాద్, మార్చి 15(నమస్తే తెలంగాణ): శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం తీవ్ర విమర్శలకు గురవుతున్నది. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇలా ఎలా మాట్లాడుతారంటూ రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి భాష సంగతి తెలిసిందే అయినా, తాజా ప్రసంగం మరింత జుగుప్సాకరంగా ఉందని చెప్తున్నారు.
సభలో రేవంత్ స్పీచ్‌లో రైతులు, జర్నలిస్టులపై తిట్ల పురాణం, నీతి, జాతి అంటూ ప్రతిపక్ష నేతలపై చేసిన జుగప్సాకరమైన మాటలే ఉన్నాయి. తోడ్కలు తీస్తా, బట్టలూడదీసి కొడతా అంటూ యూట్యూబ్ జర్నలిస్టులపై విపరీత వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. చిరవకి రైతులను కూడా దుర్మార్గులంటూ కించపరిచేలా దూషించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి ‘నువ్వు అనుకుంటున్నవేమో… హద్దు దాటితే.. మాట తూలితే దాని ఫలితం ఎలా ఉంటుందో అనుభవిస్తారు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. రెండున్నర గంటల పాటు సాగిన సీఎం ప్రసంగం ప్రతిపక్షాలను తిట్టడం, పథకాలపై అబద్ధ్దాలు చెప్పడమే కనిపిస్తుంది.
రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో చెప్పిన అబద్ధ్దాలేంటి, అసలు వాస్తవాలేంటో చూద్దాం.
రేవంత్‌రెడ్డి: మరే రాష్ట్రంలో లేనివిధంగా రైతు రుణమాఫీ చేసినం.
వాస్తవం: సగం మంది రైతులు రుణమాఫీ కాలేదని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీకి అర్హులైన రైతులు 42 లక్షల మంది కాగా కేవలం 25.35 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. మొత్తం రూ.31వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉంటే నాలుగు విడతల్లో చేసిన మొత్తం రూ. 20,616 కోట్లు. ఇంకా 16.65 లక్షల మందికి రూ.10,384 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంది. కానీ మొత్తం పూర్తయిందని చెప్పడం ఏంటో!
రేవంత్‌రెడ్డి: రైతుభరోసా రూ.12వేలు ఇస్తున్నాం. నిరుడు యాసంగిలో బీఆర్ఎస్ సర్కారు ఎగ్గొట్టిన రైతుబంధు పైసలు మేమే ఇచ్చాం.
వాస్తవం: రైతుభరోసా డబ్బులు రూ.15వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక మాట తప్పి, రూ.12 వేలకు పరిమితమైంది. ఎన్నికల కోడ్ సాకుతో నాటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నెపం బీఆర్ఎస్పైకి నెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం: సన్న వడ్లకు 1206 కోట్ల బోనస్ ఇచ్చినం.
వాస్తవం: ఎన్నికల్లో అన్ని రకాల ధాన్యానికి రూ. 500బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక కేవలం సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తున్నది. వానకాలంలో బోనస్ కింద రూ. 1206 కోట్లు ఇవ్వాల్సి ఉండగా మూడు నెలలుగా ఇంకా రూ. 400 కోట్లు చెల్లించకుండా బకాయి పెట్టింది.
రేవంత్‌రెడ్డి: ప్రజలు బీఆర్ఎస్ను మార్చురీకి పంపించారని అన్నాను. కేసీఆర్ వందేళ్లు బతకాలి.
వాస్తవం: ‘మీకు మీరు మాకు స్టేచర్ ఉన్నదని అనుకుంటే ఆ స్టేచర్ ఉన్నదని విర్రవీగితే, స్ట్రెచర్ మీదకు పంపించిన్రు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చురీకి పోతరు. ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి’ ఇవీ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
రేవంత్‌రెడ్డి: బతుకమ్మ చీరలను రద్దు చేసి.. మహిళలకు రెండు మంచి చీరలు ఇస్తున్నాం.
వాస్తవం: మహిళలకు బీఆర్ఎస్ ప్రభుత్వం దసరాకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఒక్క చీర కూడా పంపిణీ చేయలేదు.
రేవంత్‌రెడ్డి: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఏడాదిలో మా ప్రభుత్వం 57,924 ఉద్యోగాలు ఇచ్చింది.
వాస్తవం: బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలకు కాంగ్రెస్ సర్కారు ఫలితాలు వెల్లడించింది. 57924 ఉద్యోగాల్లో సుమారు 47వేల ఉద్యోగాల ప్రక్రియ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తికాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 11వేల ఉద్యోగాలను మాత్రమే.
రేవంత్‌రెడ్డి: బీఆర్ఎస్ సర్కారులో రాష్ర్టానికి మెడికల్ కాలేజీలు కావాలని అడగలేదు. మేం 8 కాలేజీలు తీసుకొచ్చినం.
వాస్తవం: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 5 మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండగా బీఆర్ఎస్ హాయాంలో జిల్లాకు ఒకటి చొప్పున 29 కాలేజీలను తీసుకొచ్చింది. 21 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మిగిలిన 8 కాలేజీలకు అడ్మిషన్లకు అనుమతి తీసుకొచ్చారు రేవంత్‌రెడ్డి.
రేవంత్‌రెడ్డి: మోదీ పెద్దన్నే. ఢిల్లీకి 32సార్లు కాదు.. 300 సార్లు పోతా.
వాస్తవం: మోదీ, రేవంత్ బడేభాయ్, చోటేభాయ్ బంధం మరోసారి బయటపడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. 32 ఢిల్లీ పర్యటనల్లో ప్రధాని మోదీని 3సార్లు కలిశానని రేవంత్ స్పష్టంచేశారు. మరి మిగిలిన సమయాల్లో ఎందుకు వెళ్లినట్టు? ఎవరిని కలిసినట్టు?, ఎందుకు కలిసినట్టు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రేవంత్‌రెడ్డి: రాష్ర్టానికి 15 నెలల్లో రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం.
వాస్తవం: గత ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలతో మళ్లీ ఒప్పందాలు చేసుకుని, వాటిని తమ ఖాతాలో వేసుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శకులు మండిపడుతున్నారు. నిరుడు జరిగిన దావోస్ ఒప్పందాలను పరిశీలిస్తే.. ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదు.
రేవంత్‌రెడ్డి: కృష్ణానదిపై ప్రాజెక్టులు పూర్తిచేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది.
వాస్తవం: దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల ప్రాజెక్టును నిర్మించినా కూడా ఎనాడూ ఎఫ్ఆర్ఎల్కు నింపలేదు. కేసీఆర్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది.
రేవంత్‌రెడ్డి: కేసీఆర్ హయాంలో కృష్ణాజలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది.
వాస్తవం: ఆయకట్టుకే నీరందించలేక ఆపసోపాలు పడుతున్న జూరాల ప్రాజెక్టుపై భారం మీద భారం మోపిందే కాంగ్రెస్. కేసీఆర్ హయాంలో ఏడాది పొడవునా కృష్ణా జలాలు అందుబాటులో ఉండేందుకు వీలుగా 215టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం గల అతిపెద్ద జలాశయం శ్రీశైలం నుంచే చేపట్టాలని రీడిజైన్ చేశారు.
రేవంత్‌రెడ్డి: బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులు చేయలేదు
వాస్తవం: బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులు కొనసాగాయి. సీపేజీ పెరిగిందని, పనులు చేయలేమని కాంట్రాక్టు సంస్థ చేతులేత్తయడంతో సదరు ఏజెన్సీకి అప్పటివరకు చెల్లిస్తున్న డీవాటరింగ్ చార్జీలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే సవరించింది. పనిచేస్తున్న చోటు ప్రమాదకరమని తెలిసినా, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా, ప్రచారం కోసం పనిచేసి 8మంది కార్మికుల మృతికి కారణమైందే కాంగ్రెస్. ఇప్పుడు ఆ నెపాన్ని కూడా బీఆర్ఎస్పై నెట్టడం సిగ్గుచేటు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.