మహబూబ్‌నగర్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొడంగల్ : సీఎం రేవంత్‌రెడ్డికి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే నిరసన సెగ తగిలింది. వైద్య, ఇతర కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించడంపై ఆగ్రహంతో ప్రజలు, జేఏసీ నేతలు సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వచ్ఛంద బంద్ పాటించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. సీఎం పదే పదే వల్లెవేసే కొడంగల్‌లో చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామానికి కాంగ్రెస్ శ్రేణులు కంగుతినగా.. పోలీసులు, అధికారులు బుజ్జగించి బంద్‌ను విరమింపజేయాల్సి వచ్చింది.
కొడంగల్‌కు మంజూరు చేసిన మెడికల్ కళాశాల, వెటర్నరీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల ప్రాంతాలకు తరలించడాన్ని నిరసిస్తూ కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఉదయం నుంచి కొడంగల్‌లో వ్యాపార వాణిజ్య సంస్థలు.. హోటల్స్, చిన్న చిన్న దుకాణాలు సైతం బంద్ పాటించాయి. గతంలో అనేక సార్లు నిరసనలు కూడా తెలిపారు. బంద్‌కు పిలుపునిచ్చిన కార్యాచరణ సమితి నేతలు గంటి సురేశ్, ఈరనపల్లి శ్రీనివాస్, రమేశ్‌బాబు, మాసాని వెంకటయ్య తదితరులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసేందుకు ప్రయత్నించినట్టు ప్రచారం జరగడంతో వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఒక అధికారిని నియమించి రెండేళ్ల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని విమర్శలున్నాయి.
రేవంత్‌రెడ్డికి సొంత నియోజకవర్గం నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గతంలోనే లగచర్లలో ఫార్మా ఇండస్ట్రీయల్ కారిడార్ పేరిట ప్రభుత్వం పేదల భూములను లాక్కొనేందుకు ప్రయత్నించగా గిరిజనులు తీవ్రంగా అడ్డుకున్నారు. ఇది కలెక్టర్‌తో పాటు ‘కాడ’ అధికారిపై దాడికి దారితీసింది. అనేకమంది రైతులను జైలుకు పంపి రణరంగాన్ని తలపించేలా చేసి భయబ్రాంతులకు గురిచేశారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక భూసేకరణ చట్టాన్ని ఇక్కడ అమలు చేస్తున్నది. నిబంధనలను తుంగలో తొక్కి పరిహారాన్ని పెద్ద ఎత్తున పెంచి.. రైతులను మచ్చిక చేసుకుని అనేక తాయిలాలు ఇచ్చి భూమి సేకరించింది. ఈ క్రమంలో కొడంగల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాలతో పాటు ఇతర విద్యాసంస్థలను మంజూరు చేశారు. దీంతో కొడంగల్ నియోజకవర్గ కేంద్రం అభివృద్ధి జరుగుతుందని అంతా భావించారు. హఠాత్తుగా అన్నింటినీ లగచర్ల ప్రాంతానికి తరలించడంతో ప్రజలు భగ్గుమంటున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో బంద్‌కు పిలుపు ఇవ్వడం ప్రభుత్వ వర్గాలను కుదిపేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యంగా దీన్ని పరిగణించారు. సీఎం స్థాయిలో నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల్లో ఎందుకింత వ్యతిరేకత వస్తున్నదోనని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం వస్తున్నాడని తెలిసి బంద్‌కు సన్నాహాలు చేయడం, దీనిని ఇటు కాంగ్రెస్, అటు పోలీసు వర్గాలు పసిగట్టకపోవడంతో కొడంగల్‌లో అసలేం జరుగుతున్నదో అర్థం కావడం లేదు. బంద్‌కు పిలుపునిచ్చిన నేతలు అజ్ఞాతంలోకి వెళ్లడం కూడా పోలీసు వైఫల్యాలను బయటకు వచ్చేలా చేసింది. కొడంగల్‌కు మంజూరైన విద్యాసంస్థలను యథావిధిగా ఏర్పాటుచేయాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.