హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ సమ్మె చిలికి చిలికి గాలివానగా మారి ప్రభుత్వం మెడకు చుట్టుకోవడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. సమ్మెను నిలువరించడంలో విఫలమయ్యావంటూ పొన్నంపై రుసరుసలాడారని విశ్వసనీయంగా తెలిసింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంను పరోక్షంగా ఉద్దేశిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. సమ్మెను ఆపలేకపోయారంటూ అసంతృప్తి వ్యక్తంచేశారని తెలిసింది. ‘ఇంత చిన్న విషయాన్ని కూడా డీల్ చేయకపోతే, కార్మికులను కట్టడి చేయకపోతే మీరంతా ఉండి ఎందుకు?
ఇంత చిన్న విషయాన్ని కూడా నా వరకు తీసుకొస్తారా? కాస్త ప్లానింగ్‌గా, కాస్త ముందుగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేది కాదు’ అని మంత్రి పొన్నంను, ఆర్టీసీ అధికారులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారని తెలిసింది. మీ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ఇరుకునపడే పరిస్థితి, ప్రజల్లో ప్రభుత్వం దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు ప్రయత్నించినందున కార్మికులు మరింత రెచ్చిపోతారని, సమ్మె మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉంటుందని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది.