హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఇల్లు అలకగానే పండుగ అయిపోయినట్టుంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన సందర్భంగా రూ.36 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా, ఇందులో కార్యరూపం దాల్చేదెంత అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
గత జనవరిలోనూ ఇలాగే ప్రభుత్వం దావోస్లో రూ.40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రకటించింది. కానీ వాటిలో ఏ ఒక్క కొత్త కంపెనీ ఇంతవరకు ప్రారంభమైన దాఖలాలు లేవు. జనవరిలో దావోస్లో, తాజాగా అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డుస్థాయిలో రూ. 76,232 కోట్ల పెట్టుబడులు సాధించినట్టు బుధవారం ప్రకటన జారీ చేసింది.
ఇందులో చాలా కంపెనీలు గతంలో ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు చేసుకున్నవే కావడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఇవి పెట్టుబడులు కాదు, కేవలం ఒప్పందాలు మాత్రమే. ప్రభుత్వంతో ఆయా కంపెనీలు చేసుకున్న అవగాహనా ఒప్పందాల(ఎంఓయు)కు ఎటువంటి చట్టబద్ధత ఉండదు. ఈ ఎంఓయులు ఏ మేరకు కార్యరూపం దాల్చుతాయో అనేది సదరు కంపెనీ ఇక్కడ భూములు కొనుగోలుచేసి కంపెనీ ప్రారంభించేవరకు చెప్పడం కష్టం.
చట్టబద్ధత లేని ఎంఓయూలతో కంపెనీలు వచ్చేనా?
చాలా కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకోవడంలో చూపిన ఉత్సాహం కంపెనీ ఏర్పాటుపై చూపడంలేదు. హడావుడిగా పెట్టుబడులు ప్రకటించి, ప్రభుత్వంతో ఎంఓయులు కుదుర్చుకొని అనంతరం ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ ఒడిదుడుకులు, ఇతర రాష్ర్టాలు ఇచ్చే రాయితీలు తదితర అనేక అంశాల వల్ల వెనక్కు పోతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయులన్నీ పెట్టుబడులుగా చెప్పేందుకు అవకాశం లేదు.
ఉమ్మడి లక్ష్యంతో రెండు, లేక అంతకన్నా ఎక్కువ పక్షాలు కలిసి పనిచేసేందుకు అంగీకరిస్తూ సంతకాలు చేస్తే దీనికి చట్టబద్థత ఉంటుంది. ఏ పక్షమైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానానికి వెళ్లి నష్టపరిహారం కోరవచ్చు. ఎంవోయుకు విషయానికొస్తే, ఇది కేవలం ఇరు పక్షాలు పరస్పర అవగాహనతో సూత్రప్రాయంగా కుదుర్చుకునే ఒప్పందం మాత్రమే. దీనికి కచ్చితమైన నియమ నిబంధనలు ఏవీ ఉండవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో పలు కంపెనీలు చేసుకుంటున్న ఎంవోయులకు ఏ మేరకు ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ రెండు కంపెనీలపై అనుమానాలు: క్రిశాంక్
అమెరికా పర్యటనలో రెండు కంపెనీలతో సీఎం రేవంత్రెడ్డి చేసుకున్న ఒప్పందాలపై అనుమానాలున్నాయని బీఆర్ఎస్ పార్టీ నేత మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ఆ రెండు కంపెనీల్లో ఒకటి స్వచ్ఛ్ బయో కాగా మరొకటి వాల్ష్కర్రా అని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి సమాలోచనలు జరిపే కంపెనీల జాబితాను సీఎంవో విడుదల చేసిందని, అందులో సిగ్నా, ఆర్సీఎం, ఆర్గా, ప్రాక్టర్ అండ్ గాంబుల్, ర్యాపిడ్, సహా 15 కంపెనీలు ఉన్నాయని ఈ రెండు కంపెనీల పేర్లు వెల్లడించలేదని తెలిపారు.