CM Revanth Reddy హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): అదానీతో దోస్తీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెనుకడుగు వేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని వాపస్ ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సీఎం ఈ ప్రకటన చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. రూ.100 కోట్లు విడుదల చేయొద్దంటూ అదానీకి ఆదివారం లేఖ రాశామని చెప్పారు. ఇప్పటివరకు ఆదానీతో సహా ఏ సంస్థ నుంచీ తెలంగాణ ప్రభుత్వం నిధులు తీసుకోలేదని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ వివాదాల్లో చిక్కుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే వాస్తవం మరొకటన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్లమెంట్లో నిలదీస్తారనే భయం
రాహుల్‌గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అదానీతో కాంగ్రెస్ సీఎం రేవంత్ స్నేహం చేయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. గురువారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఇదే విషయంపై ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక రాహుల్‌గాంధీ ఇబ్బందిపడ్డారు. దీంతో అదేరోజు రేవంత్‌రెడ్డిపై రాహుల్‌గాంధీ సీరియస్ అయినట్టు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. అదానీ పెట్టుబడులను ఆహ్వానించడమేకాకుండా రూ.100 కోట్ల విరా ళం తీసుకోవడంపై రాహుల్‌గాంధీ సీఎంను వివరణ కోరినట్టు సమాచారం. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇదే అంశాన్ని సభలో ప్రస్తావిస్తే ఇరుకున పడతామని కాంగ్రెస్ పెద్దలు భయపడ్డారని చెప్తున్నారు. అందుకే, ఈ అంశంపై వెంట నే నిర్ణయం తీసుకొని ప్రజలకు వివరణ ఇవ్వాలని అల్టిమేటం జారీచేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరే ముందే వివరణ ఇవ్వాలని స్పష్టంచేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించారని అంటున్నారు.
రాజకీయాలతో సంబంధం లేదు.. కానీ మంత్రులను కలుస్తా
తాను సోమవారం ఢిల్లీకి వెళ్లి మంగళవారం తిరిగి వస్తానని సీఎం చెప్పారు. ఈసారి పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె పెండ్లికి హాజరయ్యేందుకు వెళ్తున్నానని చెప్పారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం అవుతానని, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తానని తెలిపారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో భేటీ అవుతాననడం విశేషం. ఇక.. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పెద్దలను కలిసి అదానీ అంశంపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినట్టు సమాచా రం. అయితే అపాయింట్మెంట్ దొరకలేదని ప్రచారం జరుగుతున్నది.
అర్రాస్ పాటలా లెక్కిస్తున్నారు
సీఎం రేవంత్ సోమవారం ఢిల్లీకి బయలుదే రి వెళ్లారు. 11 నెలల్లో ఢిల్లీకి వెళ్లడం ఇది 28వ సారి. కొందరు తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ అర్రాస్ పాటలా లెక్కిస్తున్నారంటూ సీఎం మం డిపడ్డారు. రేవంత్ ఇప్పటివరకు 27 సార్లు ఢిల్లీకి వెళ్లి, కేంద్ర పెద్దలను కలిసి ఏ ప్రాజెక్టులు సాధించారో, ఎంత మేర అదనపు నిధులు వచ్చాయో చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.
కొడంగల్‌లో అదానీ సిమెంట్ ప్లాంటు
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయబో యి సీఎం రేవంత్ స్వయంగా తన రహస్యాలను బయటపెట్టుకున్నారు. తెలంగాణలో అదానీ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో, ఎక్కడ పెట్టబోతున్నారో, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సహకరించిందో స్వయంగా వివరించారు. ఇం దులో 2సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. నల్లగొం డ జిల్లా రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నది. 6మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏ ర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. రెండో ప్లాంట్‌ను కొడంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఫా ర్మాక్లస్టర్ పేరుతో పొలాలను గుంజుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే.. రైతులు అడ్డుకోవడం, అధికారులపై దాడి, అనంతరం పోలీసుల దాష్టీ కం వంటివి సంచలనం సృష్టించా యి. లగచర్ల ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి చోట 9మిలియన్ టన్నుల సిమెంట్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అదానీ సంస్థ ప్రతిపాదనలు అందించింది.
ఫ్రస్టేషన్లో సీఎం
సీఎం ఇప్పటివరకు 27సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ పర్యటనకు ముందు ప్రెస్‌మీట్ నిర్వహించలేదు. కానీ, సోమవారం ప్రత్యేకంగా నిర్వహించి న ప్రెస్మీట్లో రేవంత్ ఫ్రస్టేషన్లో ఉన్నట్టు కనిపించింది. పలుమార్లు మాటలు తడబడటం, మోతాదుకు మించి తిట్లను వాడటం ఇందుకు ఉదాహరణలని మీడియా వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తాను ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా మంత్రివర్గ విస్తరణ అంటూ రాసేస్తున్నారని, శాఖల కేటాయింపులు కూడా మీరే చేస్తున్నారంటూ మీడి యా ప్రతినిధులపై సీఎం రుసరుసలాడారు.
ఆరోపణలు చేయబోయి అభాసుపాలు
అదానీతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ స్నేహం చేశారని, కేసీఆర్ ప్ర భుత్వ హయాంలోనే అదానీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టారంటూ సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల జాబితా విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయబోయి సీఎం అబాసుపాలయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చెప్పిన అంశాల్లో 3 నేషనల్ హైవేలు ఉన్నాయి. అయితే నేషనల్ హైవేల టెండర్లు, నిర్వహణ, పర్యవేక్షణ మొత్తం నేషనల్ హైవే అ థారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇం దులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదన్న విషయం సీఎంకు తెలియకపోతే ఎలా? అని నిపుణులు విమర్శిస్తున్నారు. 2014లో అదానీ పవర్ ప్రాజెక్టులు పెట్టుకునేందుకు కేసీఆర్ అనుమతించినట్టుగా ఒక వార్త క్లిప్పింగ్‌ను సీఎం ప్రదర్శించారు. అయితే, అదానీ పెట్టుబడులను తిరస్కరిస్తున్నట్టు 2017లో నాటి సీఎం కేసీఆర్ ప్రకటించారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ విషయాన్ని రేవంత్ ఎందుకు కప్పిపుచ్చారని ప్రశ్నిస్తున్నారు. అదానీకి చెంది న 750 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ను విమర్శించారు. ఇది తెలంగాణ ప్రాజెక్టు కాదని, గుజరాత్ నుంచి తెలంగాణ మీదుగా ఏపీకి వెళ్లే లైన్ అని చెబుతున్నారు.