నర్సంపేట, డిసెంబర్ 5 : ఎమ్మెల్యేల అరెస్టును ఖండిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో నిరసనకు దిగిన వారిలో 80 ఏండ్ల వృద్ధుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగడంతో బస్సులు నిలిచిపోయాయి. ధర్నా చేస్తున్న వారిలో ఒకరు బస్సుపై రాయి విసరడంతో అద్దం పగిలిపోయింది. ఆ తరువాత బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా, పోలీసులు అడ్డుకొని, అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
కాగా నర్సంపేట రూరల్ మండల అధ్యక్షుడు 80 ఏండ్ల నామాల సత్యనారాయణతోపాటు పట్టణ కార్యదర్శి వేణుముద్దల శ్రీధర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, కొడారి రవి, పైసా ప్రవీణ్, దేవోజు సదానందం, పెరుమాండ్ల రవి, వెంకటేశ్వర్లు, మద్దెల సాంబయ్యపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్టు వీరిపై అభియోగం మోపుతూ కేసు నమోదైంది. కాగా, నామాల సత్యనారాయణ వృద్ధుడు అని చూడకుండా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఆందోళనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బాధ్యులని పోలీసులు ప్రకటించారు.