హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -2 అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తాను సీఎంగా అధికారంలో ఉండొచ్చు.. ఉండకపోవొచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు. శనివారం మాదాపూర్లోని శిల్పకళావేదికలో 783 మంది గ్రూప్ -2 విజేతలకు నియామకపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. అప్పుటివరకు నేను అధికారంలో ఉంటానో.. ఉండనో తెలియదు. కానీ అధికారులుగా మీరుంటారు. తెలంగాణ రైజింగ్ -2047ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత అధికారులుగా మీదే. ఉద్యోగుల జీతం నుంచి 10-15 శాతం కోత విధించి, తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, ఈ కొత్త చట్టాన్ని కొత్త అధికారులతోనే తయారు చేయిస్తామని చెప్పారు.