TPCC | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): టీపీసీసీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఈ మేరకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇ చ్చినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ మాత్రం మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం సముఖత వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో పార్టీ పెద్దలతో పీసీసీకి కొత్త అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. మంత్రివర్గ విస్తరణ కంటే పీసీసీ అధ్యక్షుడి నియామకంపైనే అధిష్ఠానం ప్రస్తుతం దృష్టి సారించడంతో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేకపోవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై పూర్తిస్థాయి సమీక్ష జరిపిన తర్వాత వాటి ఆధారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అధిష్ఠానం ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టు సమాచారం.
టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ అధిష్ఠానం తర్జన భర్జన పడుతున్నది. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయాన్ని మాత్రమే అడిగి తెలసుకొని, నిర్ణయం తమకు వదిలేయాల్సిందిగా స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా దీటుగా ఎదుర్కొనే నేతకే పీసీసీ పగ్గాలు అప్పగించాలన్నది పార్టీ పెద్దల యోచనగా తెలుస్తున్నది. సీఎం, డిప్యూటీ సీఎం రెండు కీలకమైన పదవులు ఓసీ, ఎస్సీకి ఇవ్వడంతో పీసీసీ పగ్గాలు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం ఉందన్నది రాష్ట్ర నాయకులు మొన్నటిదాకా అంచనా వేశారు.
అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత ఈ పదవి తిరిగి రెడ్డి సామాజికవర్గానికి దక్కినా ఆశ్చర్యం లేదని తాజాగా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరు కూడా అధిష్ఠానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు ఆ వర్గాల సమాచారం. అలాగే కర్ణాటక ఫార్ములా ప్రకారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందనే దిశగా కూడా అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి బీసీ నేతకు ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో త్వరలో టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉన్నది.