హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రూ.10,032 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉన్నదని చెప్పారు. వరద నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో సీఎం శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు తక్షణమే ఆర్థికసాయం అందించాలని కోరారు. వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని వివరించారు. ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠిన నిబంధనలు సడలించాలని కోరారు.
ఎన్డీఆర్ఎఫ్ నుంచి రూ.1,350 కోట్లు అందుబాటులో ఉన్నా నిబంధనల ప్రకారం ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని సీఎం కోరారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతోపాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజల కోసం సమీపంలోని సురక్షిత ప్రాంతాల్లో ఇండ్లను కేటాయిస్తామని, వాటి నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కోరారు.
మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన ఘటనపై కేంద్ర నిపుణుల బృందంతో శాస్త్రీయ అధ్యయనం చేయించాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, కేంద్ర బృంద సభ్యులు కల్నల్ కేపీ సింగ్, శాంతినాథ్ శివప్ప, మహేశ్‌కుమార్, నాయల్ కాన్సన్, రాకేశ్ మీనా, శశివర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.