హైదరాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ): ‘మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి’ అన్నది నానుడి. తాము చేసిందేమీ లేకపోతే తాతలో, ముత్తాతలో చేసిన వాటిని కొందరు ఇలా గొప్పగా చెప్పుకుంటారు. రాష్ట్రంలో ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి అదే నానుడిని వంటబట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండేండ్ల కాంగ్రెస్ పాలనా కాలంలో హైదరాబాద్ సహా రాష్ర్టాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి చేసింది శూన్యం. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌తోపాటు రాష్ర్టాభివృద్ధి శరవేగంగా జరిగిందనేది జగమెరిగిన సత్యం. ఈ ప్రభావం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పడుతుందనే ఆందోళన సీఎం రేవంత్‌రెడ్డిలో నెలకొన్నది. దీంతో రెండేండ్లలో తాను చేసిన అభివృద్ధి ఏమీ లేక, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని జనం మనుసుల్లోంచి తీసేయాలనే కుట్రకు తెరలేపారు.
గత మూడు రోజులుగా రేవంత్‌రెడ్డి ఈ కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. దీనిపైనే వరుసగా మీడియా సమావేశాల్లో అబద్ధాలను అందంగా వల్లె వేస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. అంతకు ముందు 1990-92 వరకు సీఎంగా ఉన్న నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పాలనను చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధి మొత్తం గత కాంగ్రెస్ పాలనలోనే జరిగినట్టుగా ఆయన చెప్పుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును వాడుకొని ఓట్లు దండుకోవాలని చూస్తుండటం గమనార్హం. రెండేండ్లలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారో?చెప్పకుండా ప్రచారం చేయడం గమనార్హం.
గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను సీఎం రేవంత్‌రెడ్డి తన ఖాతాలో వేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆనాటి కాంగ్రెస్ పార్టీతో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి ఇసుమంత కూడా సంబంధం లేకపోవడం గమనార్హం. నాడు ఉంటే బీఆర్ఎస్లో, లేదంటే టీడీపీలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి టీడీపీలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నాటి పాలనను ఈయన తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే జరిగిందని, బీఆర్ఎస్ చేసిందేమీ లేదంటూ దృష్ప్రచారానికి దిగుతున్నారు.
‘ఇది హైదరాబాదేనా? మేం హైదరాబాద్‌లో ఉన్నట్టు లేదు? ఎక్కడో లండన్లోనో, అమెరికాలోనో ఉన్నట్టుగా ఉంది’ నాడు కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌కు వచ్చిన విదేశీయులు కానీ, విదేశాలకు వెళ్లిన స్వదేశీయులు కానీ ఇప్పుడు తిరిగి హైదరాబాద్‌కు వచ్చి వెల్లడించిన అభిప్రాయాలివి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్‌కు ప్రపంచ కీర్తిని తెచ్చిపెట్టారనడంలో సందేహమే లేదు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా రూ.67,351 కోట్లు ఖర్చు చేయడం విశేషం. మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించాయి. ఫాక్స్‌కాన్ కంపెనీ ఇక్కడ తన ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పింది. ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లకు పెరిగాయి. సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు దక్కాయి. రూ.5 వేల కోట్లతో 43 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు, వెయ్యి పడకలతో వెంగళరావునగర్‌లో దవాఖాన, 42 కి.మీటర్ల మెట్రో నిర్మాణం జరిగింది.