హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే, గవర్నర్ కోటాల్లో ఎమ్మెల్సీల ఎంపికతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించడానికి సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. శనివారం ఉదయం పార్టీ పెద్దలతో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 15న రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన నేపథ్యంలో ఆలోపే ఎమ్మెల్సీల భర్తీపై పార్టీ పెద్దలతో చర్చించి ప్రకటించనున్నారు. శనివారం
ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో తుదివిడతగా చర్చించి, ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలు, నామినేటెడ్ పోస్టుల ఆశావహుల పేర్లను ప్రకటించనున్నారు. కాగా, తన ఢిల్లీ పర్యటన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించినట్టు తెలిసింది. కొందరు ఆశావాహులు నామినేటెడ్ పదవుల కోసం రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలో అక్కడికి వెళ్లిమరీ లాబీయింగ్ చేస్తుండటంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
సీఎం రేవంత్ ఈ నెల 19న బ్రిటన్‌లో జరుగనున్న ‘హలో లం డన్’ కార్యక్రమానికి హాజ రుకానున్నారు. హెస్టన్ హైడ్ హోటల్లో సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు తెలంగాణ డయాస్పోరా ఆర్గనైజేషన్స్ కోఆర్డినేటర్ గంపా వేణుగోపాల్ తెలిపారు.