హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ నేటికీ పరారీలోనే ఉన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆయన వ్యాఖ్యలతో భగీరథ్ పరారీ అంశం తేటతెల్లమైంది. శుక్రవారం నిర్వహించిన ‘కాంక్లేవ్-2026’ సాక్షిగా ఆయన బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘బాలిక విషయంలో బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు పోలేం. అత్యవసరంగా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్లు పెట్టి నోటీసులిస్తే.. అతను పరారీలో ఉన్నడు’ అంటూ కేసు నమోదై వారం దాటినా నిందితుడి ఆచూకీ కనుకోలేదని సాక్షాత్తూ సీఎం హోదాలో.. హోంశాఖను నిర్వహిస్తున్న రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘ఆయన కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎకించాలి అంటే కుదరదు. ఈ పోక్సో కేసులో కఠినంగా వెళ్లలేను.. వ్యవహరించలేను. కేసు నమోదు కాగానే వెంటనే ఇంటికి నోటీసులు అంటించాం.. ఢిల్లీకి పోలీస్ టీమ్స్‌ను పంపిం చాం.. కానీ అతను దొరుకట్లేదు. దేశ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పారిపోవడం కరెక్ట్ కాదు.. వెంటనే ఆయన కొడుకును తీసుకొచ్చి అప్పగించాలి’ అంటూ హితవు పలికారు.
భగీరథ్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తున్నదని, నిందితుడు ఎక్కడున్నాడో తెలిసినా అరెస్టుకు వెనుకాడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి వాంగ్మూలం తర్వాత కూడా సెక్షన్లు మార్చిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేయడం మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి. నాడు పోక్సో కేసు నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి, 161 స్టేట్మెంట్, 164 స్టేట్మెంట్స్ రికార్డు చేసేవారు. నిందితుడి వాంగ్మూలం తీసుకునేటప్పుడే చేసిన నేరం తీవ్రంగా ఉంటే కఠినమైన సెక్షన్లు యాడ్ చేసి, విచారణ వేగవంతం చేసేవారు. అయితే, బీజేపీ-కాంగ్రెస్ మైత్రి, ముఖ్యనేతకు నిందితుడి తండ్రి మిత్రుడు కావడంతోనే కావాలనే కాలయాపన చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
17 ఏండ్ల బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు భయపడుతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు భగీరథ్.. తెలంగాణలోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించినా అరెస్టు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అమెరికా, శ్రీలంక, అమెరికా, దుబా య్, చైనా వంటి దేశాలకు వెళ్లి సీక్రెట్‌గా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. బండి భగీరథ్‌ను అరెస్టు చేయకపోవడం వెనుక మతలబు ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసులో తాజాగా సవరించిన ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్ 5 (1) ఆర్డబ్ల్యూ 6 ప్రకారం 24 గంటల్లో అరెస్టు చేయా ల్సి ఉంటుంది. కాగా, ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదై వారం రోజులు దాటినా అరెస్టు చూపకపోవడం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తున్నది. నిందితుడు ఎక్కడున్నాడో తెలిసినా అరెస్టు చేయకుండా విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉన్నదని న్యాయ నిపుణులు అంటున్నారు.

భగీరథ్ అరెస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీజీపీకి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదా? అని న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో పర్యవేక్షణాధికారిని మాత్రమే నియమించిన డీజీపీ.. ఈ కేసుకు సంబంధించి రివ్యూలు ఎక్కడ చేస్తున్నారని నిలదీస్తున్నారు. పొలిటికల్ మోటివేషన్ ఉన్న కేసులో కచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు రివ్యూలు చేయాల్సి ఉండగా.. అవేమీ పట్టనట్టు పోలీసుశాఖ వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. ‘మహిళల భద్రత, స్టాండ్ విత్ హర్ అంటూ పోలీసు ఉన్నతాధికారులు కబుర్లు చెప్పడం తప్ప ఎవ్వరూ స్పందించడం లేదు.. వీరు స్పందించాలంటే కూడా పైనుంచి ఆదేశాలు రావాలా? అవి ఇంకా రాలేదా?’ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భగీరథ్‌ను ఇంకా ఎన్ని రోజులకు అరెస్టు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నెల 8న అమ్మాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని చెప్పిన రేవంత్, 11 వరకు పోలీసులు ప్రధాని పర్యటన బందోబస్తు విధుల్లో ఉండటంతో చర్యలు తీసుకోలేదని సర్కార్ నిర్లక్ష్యాన్ని అంగీకరించారు. రాష్ర్టాన్ని కుదిపేస్తున్న ఘటనపై ప్రధాని పర్యటన సాకుతో చర్యలు తీసుకోలేదని చెప్పడంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ‘ప్రధాని వస్తే పోలీస్ యంత్రాంగం పనిచేయదా? ప్రజల భద్రతను గాలికివదిలేస్తారా? నగర ఠాణాల్లోని పోలీసులందరూ ప్రధాని పర్యటన విధుల్లో నిమగ్నమయ్యారా? ఇంతకంటే దారుణమైన ఘటనలు జరిగినప్పుడు కూడా ఇదే విధంగా స్పందిస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు. మే 8న ఫిర్యాదు చేస్తే 11న అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే కేసు నమోదుచేశామని సీఎం చెప్పారు. కేసు నమోదులో పోలీసులు ఆలస్యం చేశారని ప్రతిపక్ష బీఆర్ఎస్, ప్రజాసంఘాలు చేసిన ఆరోపణలు నిజమేనని ముఖ్యమంత్రే పరోక్షంగా ఒప్పుకొన్నారు. అదేవిధంగా ‘బండి భగీరథ్ మీద కేసు నమోదైతే ఆయన తండ్రిని అరెస్ట్ చేయాలా?’ అని ఎదురు ప్రశ్నించిన తీరు కుమ్మక్కు రాజకీయాలకు అద్దంపడుతున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమ్మాయి సర్టిఫికెట్లు సేకరించామని, ఆధారాలు దొరికితే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించిన తీరు ఆయన నిర్లిప్తతతను బయటపెడుతున్నదని చెప్తున్నారు.
‘తప్పు చేసినట్టు తేలితే భగీరథ్‌ను శిక్షించే బాధ్యత తనది అని చెప్పిన రేవంత్‌రెడ్డి.. నిందితుడి తండ్రే కొడుకును అప్పగించాలని కోరడమంటే రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పనిచేయడం లేదా? కేసు నమోదై ఐదు రోజులైనా నిం దితుడిని పట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉన్నదా? లేదంటే పారిపోయేందుకు సహకరించారా?’ అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. సామాన్యులు చిన్న నేరం చేసినా, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా అర్ధరాత్రి సైతం వెంటాడి వేటాడి పట్టుకున్న పోలీసులు, భగీరథ్ విషయంలో ఎందుకు ఉదాసీనత చూపారని విమర్శిస్తున్నారు.
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో మొదటి నుంచీ ఆధారాలతో ప్రభుత్వాన్ని కడిగిపారేస్తున్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై రేవంత్‌రెడ్డి అసహనం ప్రదర్శించారు. ఆర్ఎస్పీ ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఒకవేళ ఆర్ఎస్పీ తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా ముందు కెళ్లాలి..కానీ ఆయనకు ఏమీ తెలియదని, గడీలకు వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పి, ఇప్పుడు గడీల కోసం పనిచేస్తున్నారని పొంతనలేకుండా విమర్శలు చేసిన తీరు చర్చనీయాంశమైంది. ఫ్రస్ట్రేషన్లో ఏమీ పాలుపోక రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో రెండు పోక్సో కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా యాలాలలో తాగునీళ్ల వంకతో, ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. వేసవి సెలవుల కోసం తిరుపతి వెళ్లిన హైదరాబాద్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన బాబాయ్ మీదా పోక్సో కేసు నమోదైంది. రెండు ఘటనల్లోనూ పోలీసులు ఫాస్ట్ట్రాక్గా స్పందించి కేసులు పెట్టడమే కాకుండా, నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు.

మరో పోక్సో కేసును ఫాస్ట్ట్రాక్గా విచారించిన ప్రత్యేక న్యాయస్థానం.. మైనర్‌పై లైంగికదాడికి పాల్పడిన బోయినపల్లి కానిస్టేబుల్‌కు ఏకంగా 30 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. పోక్సో కేసులోని తీవ్రత అది! మైనర్లపై లైంగికదాడికి పాల్పడితే చట్టం ఎంత తీవ్రంగా పరిగణిస్తుందనే దానికి ఇదో ఉదాహరణ.

సామాన్యుడిపై అతివేగంగా స్పందించిన పోలీసు వ్యవస్థ.. బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. శిక్ష సంగతి దేవుడెరుగు.. కేసు నమోదై వారందాటినా కనీసం నిందితుడిని అరెస్ట్ చేయలేదు. రెండుసార్లు విచారణకు రాకున్నా.. ఇంతవరకు చర్యల్లేవు. నోటీసులు, నోటిమాటలకే పోలీసు శాఖ పరిమితమైంది.

తీవ్ర ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతున్నా.. చర్యలు తీసుకోకుండా పోలీసులు చేతులు ముడుచుకొని చూస్తుంటే.. ప్రభుత్వసారథి రేవంత్‌రెడ్డి మాత్రం ధర్మపన్నాలు చెప్తున్నారు. బండి భగీరథ్ పారిపోవడం తప్పని, ఆయనను తండ్రే తీసుకువచ్చి అప్పగించాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. మరి, సకాలంలో చర్యలు తీసుకోకుండా నిందితుడికి పారిపోయే అవకాశం ఇచ్చిందెవరు? ఆయనే వచ్చి లొంగిపోయేవరకు అరెస్టు చేయరా?

కొడుకును అప్పగించే సంగతి అటుంచితే.. నిందితుడి తండ్రి నిన్నటిదాకా ఏమన్నరు? ‘నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. కుట్రదారుల సంగతి తేలుస్తా’ అంటూ కరీంనగర్లో హనుమాన్ జయంతి ర్యాలీలో అసందర్భంగా మాట్లాడి, ఆవేశంతో భీషణ ప్రకటన చేశారు. ఇప్పుడేమో.. కొడుకు ఇష్యూతో తనకేమీ సంబంధం లేదని అంటున్నరు. కొడుకు పేరుకు ముందూవెనుక తన పేరు జోడించవద్దని కోరుతున్నరు. కోర్టులో కేసు వేసి.. గ్యాగ్ ఆర్డరూ తెచ్చుకున్నరు.

ఇదీ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ సాగుతున్న తీరు. నిందితుడు సామాన్యుడైతే ఒకరకంగా, అధికారం అండగా ఉన్న సంపన్నుడైతే మరోరకంగా దర్యాప్తు ఎట్లా ఉంటుందో ఇది తేటతెల్లం చేస్తున్నది. కాంగ్రెస్-బీజేపీ పెద్దలు చేతులు కలిపి ఎట్లా పనిచేస్తున్నారో చెప్పేందుకు ‘భగీరథ్’ కేసు తాజా ఉదాహరణ.
