కరీంనగర్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ)/జమ్మికుంట, జయశంకర్ భూపాలపల్లి, (నమస్తే తెలంగాణ)/ రేగొండ: దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, బీఆర్ఎస్కు 12 సీట్లు ఇస్తే నామా నాగేశ్వరరావును కేంద్రమంత్రిని చేస్తానని కేసీఆర్ అంటున్నారని, ఆయనను మాత్రం ఇండియా కూటమిలో చేరనిచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి వచ్చి తన ఇంటిపై వాలితే కాంగ్రెస్ కార్యకర్తలు కాల్చి చంపుతారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను ఓడించాలన్న కుట్ర జరుగుతున్నదని గ్రహించిన సీపీఐ, సీపీఎం, కోదండరాం తమ పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు.
బీజేపీ నాయకులు దేవుడి పేరు చెప్పి బస్టాండ్లలో బిచ్చగాళ్ల మాదిరిగా ఓట్లు అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. రాముడు బీజేపీకి మాత్రమే కాదని, ప్రతి హిందువుకు దేవుడేనని పేర్కొన్నారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయ వ్యాపారం చేస్తున్నదన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని, దేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని ఆరోపించారు.
గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదు
గాడిద గుడ్డున్న కటౌట్‌ను రేవంత్ చూపెడుతూ మోదీ ఈ దేశానికి గాడిద గుడ్డును కూడా ఇవ్వలేదని విమర్శించారు. సెమీఫైనల్‌గా భావించిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు గుజరాత్‌కు పారిపోయారని, పార్లమెంట్ ఎన్నికల్లో సూరత్‌కు పారిపోయేలా తీర్పు ఇవ్వాలని కోరారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.
70 ఏండ్లుగా కొనసాగుతున్న రిజర్వేషన్లను తొలగించేందుకు తమకు రెండింట మూడోవంతు మెజార్టీ కట్టబెట్టాలని అమిత్‌షాలాంటి నాయకులు కోరుతున్నారని పేర్కొన్నారు. తాను అదే విషయాన్ని రెండుమూడు సభల్లో, టీవీ చానళ్లలో మాట్లాడితే కేంద్ర హోంశాఖ తనకు నోటీసులు పంపిందని తెలిపారు.
తెలంగాణ పౌరుషమా.. గుజరాత్ పెత్తనమా?
కాంగ్రెస్ తెచ్చిన రిజర్వేషన్లతోనే ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి, కడియం కావ్య డాక్టర్ అయ్యారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు అమలవుతాయని, బీజేపీ వస్తే వాటికి మంగళం పాడుతుందని తెలిపారు. గుజరాత్ పెత్తందార్లు, ఢిల్లీ సుల్తాన్లు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. సరిహద్దు సైన్యాన్ని తెచ్చినా వెనుకాడేది లేదని పేర్కొన్నారు.
ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ పెత్తనానికి మధ్య జరుగుతున్న పోటీ అని రేవంత్ అభివర్ణించారు. సభలో మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రాజేందర్‌రెడ్డి తదితరులున్నారు.
CMRevanthreddy
శివయ్యపై ప్రమాణం చేసి చెప్తున్నా
రైతు రుణమాఫీపై రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రామప్ప దేవాలయంలోని శివుడిపై ప్రమాణం చేసి చెప్తున్నానని, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. లేదంటే ఈ ప్రభుత్వం ఉండి కూడా లాభం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయాన్ని ఇంటింటికీ వెళ్లి చెప్పాలని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా విద్యావంతుడైన వెలిచాల రాజేందర్రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్‌బాబు, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, సీపీఎం నాయకులు వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు..